త‌ల్లి మందుల కోసం కూతురి టిక్ టాక్ వీడియో.. స్పందించిన సీఎం

త‌ల్లి మందుల కోసం కూతురి టిక్ టాక్ వీడియో.. స్పందించిన సీఎం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కార‌ణంగా కొంద‌రు నిత్యావసరాల కోసం , అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌రికొంద‌రు మెడిసిన్స్ కోసం ఇబ్బంది ప‌డుతున్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెళ‌గావి జిల్లాలో కీడ్నీ స‌మస్యతో బాధ‌ప‌డుతున్న త‌న త‌ల్లి కోసం ఓ యువతి టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అయి సీఎం యడియూరప్ప దృష్టిలో పడింది. ఆయన వెంటనే స్పందించి సదరు యువతికి సహాయం చేశారు. ఈ సంఘటన రాయదుర్గ తాలూకా, నరసాపుర గ్రామంలో జరిగింది.
శేఖవ్వ అనే మహిళకు రెండు కిడ్నీలూ పాడవడంతో ఆమె భర్త ఓ కిడ్నీని దానం చేశారు. జనవరిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆపై ఆమె ఇంట్లోనే మెడిసిన్స్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది. అయితే లాక్ డౌన్ కారణంగా శేఖవ్వ కు కావాల్సిన మందులు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె కూతురు పవిత్ర, తల్లి బాధను చెబుతూ, టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అయి కర్ణాటక సీఎం యడియూరప్పను చేరగా, ఆయన సూచనతో, జిల్లా అధికారులు శేఖవ్వ  ఇంటికి వెళ్లి, నెల రోజులకు సరిపడా మందులను అందించారు. మరేదైనా సమస్య ఏర్పడితే, తమకు తెలియ‌జేయాల‌ని సూచించారు. సకాలంలో స్పందించి మందులు పంపిన సీఎంకు తల్లీ కూతుళ్లు కృతజ్ఞతలు తెలిపారు.