రెండు నేషనల్​ హైవేలు కలిసేచోట గ్రేడ్ ​సెపరేటర్​ కట్టలే

రెండు నేషనల్​ హైవేలు  కలిసేచోట గ్రేడ్ ​సెపరేటర్​ కట్టలే

ఖమ్మం, వెలుగు: జాతీయ రహదారుల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చేలా కనిపిస్తోంది. వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నేషనల్ హైవేల విషయంలో చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూడాల్సిన అధికారులే తప్పులు చేస్తున్నారు. రెండు జాతీయ రహదారులు కలిసేచోట తప్పని సరిగా గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్ నిర్మించాలనే రూల్స్​కు విరుద్ధంగా ప్రస్తుతం సూర్యాపేట – ఖమ్మం హైవే(ఎన్​హెచ్ 365 బిబి) నిర్మాణం జరుగుతోంది. సూర్యాపేట జిల్లా టేకుమట్ల దగ్గర ఈ రోడ్డు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి(ఎన్​హెచ్ 65)ని కలుస్తుంది. ఈ ప్రాంతంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా గ్రేడ్ సెపరేటర్ నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం ఎట్ గ్రేడ్(రెండు రహదారులు సమాన ఎత్తులోనే కలవడం) పద్ధతిలో నిర్మించారు. దీంతో ఆ  జంక్షన్ దగ్గర రెండు జాతీయ రహదారులపై వేగంగా ప్రయాణించే వాహనాలతో  ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ – విజయవాడ హైవేపై మలుపు ఉన్నచోట, దూరం నుంచి స్పష్టమైన విజిబిలిటీ లేని దగ్గర మరో హైవేను లింక్ చేయడం చాలా డేంజర్ అన్న అభిప్రాయాలున్నాయి. 

రూ. 1,560 కోట్లతో నిర్మాణం

కేంద్ర ప్రభుత్వ భారత్ మాల పరియోజనలో భాగంగా ఖమ్మం – సూర్యాపేట హైవేను రూ.1,560 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో నిర్మిస్తోంది. 2019 డిసెంబర్ లో రహదారి పనులు ప్రారంభం కాగా ఈ ఏడాది మే నెలాఖరుకు కంప్లీట్ చేయాల్సి ఉంది. కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం మొత్తం 59 కిలోమీటర్లలో 55 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. గత నెల 22 నుంచి ప్రొవిజనల్ కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ గా ప్రకటించారు. దీన్ని ప్రకటించిన ఒకట్రెండు వారాల్లో ఆ రహదారికి సంబంధించిన టోల్ ఫీజును వసూలు చేసుకునేందుకు కాంట్రాక్టర్ కు అనుమతి లభిస్తుంది. ఈ నెల మొదటివారంలో మోతె మండలం మామిళ్లగూడెం సమీపంలో నిర్మించిన టోల్ గేట్ దగ్గర వెహికల్స్​నుంచి ఫీజుల వసూలు ప్రారంభించనున్నారు. అయితే అత్యంత కీలకమైన గ్రేడ్ సెపరేటర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, దాని నిర్మాణం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మళ్లీ ప్రస్తుత ప్రాజెక్టులో భాగంగా కాకుండా హైదరాబాద్ – విజయవాడ హైవేకు సంబంధించిన వాళ్లే నిర్మించాలని చెబుతూ ఆఫీసర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కాంట్రాక్టర్ కు మాత్రం టోల్ ఫీజులు వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల వాహనదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  

గ్రేడ్ ​సెపరేటర్ ​తప్పనిసరి

ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) మాన్యువల్ ప్రకారం గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్ ద్వారానే రెండు జాతీయ రహదారులను కలపాలి అనే రూల్​ఉంది. ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం గ్రేడ్ సెపరేటర్ ను తప్పనిసరి చేశారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి గతంలోనే నిర్మించారు. ప్రస్తుతం ఖమ్మం – సూర్యాపేట హైవేను కొత్తగా నిర్మిస్తూ పాత హైవేకు కలుపుతున్నారు. కొత్త హైవే ప్లాన్ లో భాగంగా ముందుగా గ్రేడ్ సెపరేటర్ నిర్మించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కొత్త హైవేపై ప్రొవిజనల్ కమర్షియల్ ఆపరేషన్ డేట్(పీసీఓడీ) ప్రకటించిన తర్వాత అక్కడ ఫ్లై ఓవర్ లేదా అండర్ పాస్ బ్రిడ్జి ద్వారా గ్రేడ్ సెపరేటర్ నిర్మించేందుకు ఇప్పుడు ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే హైదరాబాద్ – విజయవాడ హైవేకు నకిరేకల్ సమీపంలో మరో జాతీయ రహదారిని కలిపారు. సిరోంచ – రేణిగుంట మధ్య జాతీయ రహదారి నకిరేకల్ మీదుగా పోతుండగా, అక్కడ ఎన్​హెచ్ 65 ను గ్రేడ్ సెపరేటర్ నిర్మించి కలిపారు. ఇదే పద్ధతిని టేకుమట్ల సమీపంలో కలిసే దగ్గర మాత్రం ఫాలో అవకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.