లెవీ బియ్యాన్ని బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న మిల్లర్లు

లెవీ బియ్యాన్ని బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న మిల్లర్లు
  • 60 మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఎఫ్​సీఐ అధికారులు
  •     బోధన్​ మండలంలోని ఒకే రైస్​మిల్​లో రూ.7.5 కోట్ల విలువైన 38వేల క్వింటాళ్ల ధాన్యం మాయం
  •     డిప్యూటీ తహసీల్దార్​ ఫిర్యాదుతో క్రిమినల్​ కేసు నమోదు
  •     రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు రెడీ అవుతున్న ఎఫ్​సీఐ

వెలుగు, నిజామాబాద్​:  నిజామాబాద్​ జిల్లాలో భారీ సీఎంఆర్​ (కస్టమ్​మిల్లింగ్ ​రైస్​) స్కామ్ ​బయటపడింది. సివిల్​ సప్లై శాఖ సీఎంఆర్​ కింద మిల్లులకు ఇచ్చిన వడ్లను మరాడించి ఎఫ్​సీఐకి లెవీ పెట్టాల్సిన  మిల్లర్లు బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్నట్లు తేలింది. ఈమేరకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఎఫ్​సీఐ ఆఫీసర్లు గడిచిన వారం, పది రోజులుగా నిజామాబాద్​ జిల్లాల్లోని 303  రైస్​ మిల్లుల్లో  తనిఖీలు చేపట్టగా, సుమారు 60కి పైగా మిల్లుల్లో సీఎంఆర్ ​ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే బోధన్ మండలం సాలూరా క్యాంప్ శివారులోని శివశక్తి రైస్ మిల్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ  రైస్​మిల్లుకు 90 వేల క్వింటాళ్ల ధాన్యం కేటాయించగా, అందులో రూ.7.50 కోట్ల విలువైన 38వేల 248.88  క్వింటాళ్ల బియ్యాన్ని మాయం చేసినట్లు గుర్తించారు. 

లక్ష టన్నులకుపైగా పక్కదారి.. 

నిజామాబాద్ జిల్లాలో 303 రైస్ మిల్లులున్నాయి. అందులో 75 పారాబాయిల్డ్ మిల్లులు కాగా,  228 రా రైస్ మిల్లులు. 2021 ఖరీఫ్​ సీజన్ లో మిల్లులకు  సుమారు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ కేటాయించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ గా చెప్పుకునే ఈ విధానంలో క్వింటాల్ కు 67 కిలోల చొప్పున బియ్యాన్ని రైస్ మిల్లర్లు ఎఫ్​సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికి కేవలం 44 శాతం సీఎంఆర్ మాత్రమే ఇచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంకా 56 శాతం బియ్యాన్ని ఎఫ్​సీఐకి అప్పగించాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా మిల్లర్లు ఎఫ్​సీఐకి బియ్యం మాత్రం అప్పగించడం లేదు. ఈ క్రమంలో కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం లేకున్నా రికార్డులో ఉన్నట్లు చూపిస్తున్నారనే ఫిర్యాదులతో ఎఫ్​సీఐ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. కొద్దిరోజులుగా నిజామాబాద్, బోధన్​, ఆర్మూర్​ డివిజన్ పరిధిలోని సుమారు 303 రైస్​ మిల్లుల్లో  తనిఖీలు చేపట్టగా, సుమారు 60కి పైగా మిల్లుల్లో సీఎంఆర్​ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఎఫ్​సీఐకి లెవీ పెట్టాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్​లో బ్రోకర్ల సాయంతో అమ్ముకున్నారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖలోని కొంతమంది ఆఫీసర్ల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.  ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సీఎంఆర్​ పెట్టాల్సిన బియ్యంలోంచి సుమారు లక్ష మెట్రిక్ టన్నులను బహిరంగ మార్కెట్​లో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి  బోధన్ మండలం సాలూరా క్యాంప్ శివారులోని ఒక్క శివశక్తి రైస్ మిల్ లోనే సుమారు 7.5కోట్ల విలువైన 38 వేల క్వింటాళ్ల బియ్యం మాయమైనట్లు బయటపడింది. పది రోజులుగా మిల్లులను తనిఖీ చేస్తున్న ఎఫ్​సీఐ ఆఫీసర్లు నోరువిప్పితేనే ఏ మిల్లులో ఎంత మేర అక్రమాలు జరిగాయనే విషయంపై స్పష్టత రానుంది.