సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ఘటన మరువకముందే హైదరాబాద్ పురానాపూల్లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూలర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మొత్తం 6 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పివేస్తున్నారు. అయితే మంటలు ఎలా అంటున్నాయన్నది ఇంకా తెలియదు. గోడౌన్ లోపల ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అందులో పనిచేస్తున్న వారు మాత్రం మంటలు అంటుకున్న వెంటనే అందరూ బయటకు పరుగులు తీశారని చెబుతున్నారు.
గోదాం రెసిడెన్షియల్ ఏరియాలో ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రజలంతా భయంతో వణికిపోయారు. ఇండ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
