- ఈ నెల11 నుంచి 25 వరకు క్యాంప్లు
- రాష్ట్రవ్యాప్తంగా 533 పీఎంశ్రీ హైస్కూళ్లు ఎంపిక
- ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల్లో సర్కారు బడుల విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 533 పీఎంశ్రీ హైస్కూళ్లలో ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని సక్రమంగా నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.
రూ.2.66 కోట్లు మంజూరు
సమ్మర్ క్యాంప్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2,66,50,000 మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలలకు రూ.50 వేల చొప్పున కేటాయించారు. ఈ నిధులను తక్షణమే ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్ల అకౌంట్లకు రిలీజ్చేయాలని డీఈవోలను డైరెక్టర్ఆదేశించారు. క్యాంప్లు ముగిసిన తర్వాత ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని సూచించారు.
అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఎంట్రీ
ఈ సమ్మర్ క్యాంప్లు కేవలం పీఎంశ్రీ స్కూళ్ల విద్యార్థులకే పరిమితం చేయకుండా.. పొరుగున ఉన్న ఇతర సర్కారు బడుల విద్యార్థులూ పాల్గొనేలా అవకాశం కల్పించారు. ప్రతి క్యాంప్‌ను సెక్టోరల్ ఆఫీసర్లు, ఎంఈవోలు ప్రతిరోజూ పర్యవేక్షించాలని డైరెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు వేసవి వేడి నుంచి ఇబ్బంది కలగకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో శిక్షణ ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
