మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుషాయిగూడ పోచమ్మ టెంపుల్ వద్ద ఉన్న ఆదిత్య టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. అగ్నిప్రమాదంలో నరేష్, సుమ దంపతులు, వారి ఆరేళ్ల కుమారుడు జశ్వంత్ చనిపోయారు. భారీగా మంటలు రావడంతో టింబర్ డిపో పక్కన ఉన్న కమర్షియల్ బిల్డింగ్ కు వేగంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో నిద్రలో ఉండడం వల్ల పొగ పీల్చుకోవడంతో ముగ్గురు చనిపోయి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో టింబర్ డిపో పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించాయి. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేస్తున్నారు. 

ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 3 గంటల 30 నిమిషాలకు ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని ఫైర్ సిబ్బంది చెప్పారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి కుషాయిగూడ ఏసీపీ, మల్కాజ్ గిరి డీసీపీ వెళ్లారు. మంటల్లో మృతిచెందిన ముగ్గురు మృతదేహాలను బయటకు వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. 

ఇండ్ల మధ్యలో టింబర్ డిపో

జన సముహంలో టింబర్ డిపో నడుపుతున్నారని గుర్తించారు. ఆదిత్య టింబర్ డిపో నిర్వహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మెయిన్ రోడ్ పక్కన, అపార్ట్ మెంట్స్ మధ్యలో టింబర్ డిపో ఉంది. ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటించలేదని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెక్క ముక్కలు, వుడ్, కట్టె సామాగ్రి అధికంగా ఉండడంతో నిమిషాల్లో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 

ఘటనా స్థలానికి ప్రజాప్రతినిధులు

విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. అగ్నిప్రమాదంపై వివరాలు ఆరా తీశారు. ఇటు చర్చపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా వెళ్లారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు..  ఘటనా స్థలానికి చేరుకున్న  హోంమంత్రి మహమూద్ అలీ... ప్రమాదం గురించి ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.