మాంజాకు చిక్కుకున్న రాబందు

మాంజాకు చిక్కుకున్న రాబందు

హైదరాబాద్, వెలుగు :  ఓ భారీ సైజ్ రాబందు మాంజాకు చిక్కుకుని విలవిల్లాడుతుండగా వారియర్ కన్జర్వేషన్​ సొసైటీ సభ్యులు కాపాడారు. హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్​ పార్కు అధికారులకు అందజేశారు. మంగళవారం హైదరాబాద్​లోని సరూర్​నగర్​ లేక్​ సమీపంలో మాంజా చుట్టుకుని రాబందు గాయంతో విలవిల్లాడుతోందని చూసినవాళ్లు సమాచారమివ్వగా సొసైటీ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మాంజాను తొలగించి రాబందును కాపాడారు. ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన రాబందు అని సొసైటీ సభ్యుడు ప్రదీప్​ తెలిపారు. గతంలో పార్శిగుట్ట వద్ద కళేబరాలను తినేందుకు ఇలాంటి భారీ సైజ్  రాబందులు వచ్చేవని ఆయన వెల్లడించారు. 

పార్శీలు చనిపోయిన తమ వర్గానికి చెందిన మృతదేహాలను ఇక్కడి గుట్టపై ఉన్న బావి దగ్గర పెట్టేవారని, రాబందులు వచ్చి వాటిని తినేవని, అందుకే ఆ ప్రాంతానికి పార్శీగుట్టగా పేరు వచ్చిందని చెప్పారు. చలికాలంలో హైదరాబాద్​కు వలస వచ్చే ఈ పక్షులు ఇప్పుడు కనుమరుగయ్యాయని, తాజాగా హైదరాబాద్​లో ఈ తరహా రాబందు కనిపించడం విశేషమని అన్నారు. వివిధ రకాల పక్షులను రక్షించడమే లక్ష్యంగా తమ సొసైటీ చేస్తుందని ప్రదీప్​తెలిపారు. పక్షులకు గాయాలైనా, ఇతర కారణాలతో అవి ఇబ్బందులు పడటం కనిపించినా వెంటనే తమ సొసైటీ నంబర్ 9697887888 కు ఫోన్​ చేయాలని సూచించారు. పక్షుల కోసం తమ సొసైటీ అమీన్ పూర్​లో ప్రత్యేంగా ఒక హాస్పిటల్​ను నిర్వహిస్తోందని తెలిపారు. గాయాలపాలైన పక్షులకు ఆస్పత్రిలో చికిత్స చేసి తర్వాత వాటిని విడిచి పెడతామని చెప్పారు.