
బావిలో పడి భార్యాభర్తలు మృతి
గొడవ పడి దూకిన భార్య.. కాపాడబోయి ప్రాణాలు విడిచిన భర్త
మెదక్ జిల్లా నార్సింగిలో ఘటన
పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో గురువారం భార్యాభర్తలు బావిలో పడి చనిపోయారు. కుటుంబంలో గొడవలతో ఆవేశానికి లోనైన భార్య ముందు దూకగా, ఆమెను కాపాడబోయిన భర్త కూడా ప్రాణాలు విడిచాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..నార్సింగి గ్రామానికి చెందిన దారబోయిన నారాయణ, లచ్చమ్మల కొడుకు నగేశ్(35)కు, బోడగట్టుకు చెందిన స్వరూప(32)కు 13 ఏండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి ఐదేండ్లలోపు ఇద్దరు మగపిల్లలున్నారు. నగేశ్ దంపతులు నార్సింగి శివారులోని ఓ ఫాంహౌస్‌లో నెల రోజులుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఫాంహౌస్‌కు వెళ్లిన నగేశ్, స్వరూప రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూడగా బావి వద్ద బట్టలు, చెప్పులు, సెల్‌ఫోన్ ఉన్నాయి. బావిలో చూడగా మృతదేహాలు కనిపించాయి.
భార్యాభర్తల మధ్య గొడవలతోనే..
మూడేండ్లుగా నగేశ్మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఇంట్లో గొడవపడి ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ కూడా గొడవ పడ్డట్టు తెలిసింది. దీంతో ఆవేశానికి లోనైన స్వరూప అక్కడే ఉన్న బావిలో దూకగా, భార్యను కాపాడేందుకు నగేశ్తన బట్టలు, ఫోన్ వదిలేసి బావిలోకి దిగాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో నగేశ్, ఊపిరాడక స్వరూప ఇద్దరూ చనిపోయారు. నగేశ్ దంపతుల మృతితో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. నగేశ్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.