భద్రాద్రికొత్తగూడెం,వెలుగు: మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మాతో పాటు మరికొందరిని బూటకపు ఎన్ కౌంటర్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఘటనపై న్యాయవిచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్ లో మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టులను నిర్మూలిస్తామని, పంతం పట్టిన కేంద్రహోం మంత్రి అమిత్ షా బూటకపు ఎన్ కౌంటర్లతో ప్రజల కోసం పోరాడే మావోయిస్టు నేతలను హత్య చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసు బలగాల అదుపులో ఉన్న మరికొందరిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు.
మావోయిస్టులను ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఆనందం పొందుతుందని మండిపడ్డారు. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ మావోయిస్టులను చంపడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
