- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు కామెంట్స్
ములుగు, వెలుగు : మావోయిస్టులు తమ పంథా మార్చుకొని సమాజంలోకి వచ్చి కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కగార్ ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసే ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ చేపట్టిన బస్సు జాత గురువారం ములుగు జిల్లాలోకి ప్రవేశించింది. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ అధ్యక్షతన స్థానిక బస్టాండ్సెంటర్లో జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ తో కలిసి ఆయన మాట్లాడారు.
కగార్ ఎన్ కౌంటర్లపై ఎన్నో అనుమానాలున్నాయని, సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు. మావోయిస్టులు కూడా పునరాలోచన చేసుకుని, తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నరహంతక పాలన కొనసాగిస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసమే పని చేస్తుందని ఆయన ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడేందుకు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష పార్టీలను సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇందుకు బాధ్యత వహించాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండీ అంజాద్ పాషా, నేతలు ఉన్నారు.
