రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్ డ్రగ్స్ కేసులో  కీలక మలుపు
  •     రోహిత్​రెడ్డికి డ్రగ్స్ సప్లయ్​ చేసిన డాక్టర్ బాలాజీని అరెస్ట్​ చేసిన సిట్​
  •     గోవా నుంచి డ్రగ్స్​ కొనుగోలు చేసి రోహిత్​కు అందించిన డాక్టర్​
  •     ఇదే డ్రగ్స్​ను ఎంపీ మహేశ్​యాదవ్​, నమిత్​శర్మ వాడినట్లు సిట్​ నిర్ధారణ
  •     నేటితో కస్టడీ ముగియనుండగా, ఐదు రోజులు గడువు కోరనున్న సిట్​ 

హైదరాబాద్,వెలుగు: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు కీలక మలుపు తిరుగుతోంది. పార్టీకి ఎండీఎంఏ డ్రగ్ సప్లై చేసిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ బాలాజీని బుధవారం సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా సిట్​విచారణ చేపట్టింది. గోవా నుంచి ఎండీఎంఏ డ్రగ్ కొని రోహిత్ రెడ్డికి అందించినట్లు బాలాజీ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. 

ఇదే డ్రగ్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్​యాదవ్, నమిత్ శర్మ వినియోగించినట్లు సిట్ నిర్ధారించుకుంది. మోయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 14న జరిగిన వీకెండ్ పార్టీలో కొకైన్‌తో పాటు ఎండీఎంఏ కూడా వినియోగించినట్లు ఆధారాలు సేకరించామని అధికారులు తెలిపారు. మూడు రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం రోహిత్ రెడ్డిని ప్రశ్నించింది.

నాలుగేళ్లుగా రోహిత్​రెడ్డి  డ్రగ్స్ పార్టీలు.. 

ఫామ్‌హౌస్ కేంద్రంగా రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న డ్రగ్స్ పార్టీలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. గత నాలుగేళ్లుగా ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ రెడ్డి కాంటాక్ట్‌లలో ఉన్న డ్రగ్ పెడ్లర్లు రాకేష్ శర్మ, అభిషేక్ సింగ్‌ల వివరాలను ఇప్పటికే సేకరించగా, వీరితో పాటు డాక్టర్ బాలాజీ కూడా డ్రగ్ సప్లై చేసినట్లు సిట్ గుర్తించింది. గతంలో రోహిత్​రెడ్డికి ఎలాంటి డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో బాలాజీని సిట్​ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‌వీకెండ్‌ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి రోహిత్‌ రెడ్డికి గల సంబంధాలను ఆరా తీసినట్లు సమాచారం. 

నిందితుల మధ్య  కామన్ కనెక్షన్‌ ఏంటీ ?

ఫామ్‌హౌస్ పార్టీలో పాల్గొన్న 8 మంది నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా రోహిత్​రెడ్డి నుంచి  సిట్ మరిన్ని వివరాలు రాబడుతోంది. ప్రియాంక రెడ్డి, బాబిలోనా పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డి  రెగ్యులర్​గా పార్టీలకు హాజరవుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ, ఎంపీ మహేశ్​యాదవ్ పార్టీలో పాల్గొనడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరందరి కామన్ కనెక్షన్ ఏమిటన్న దానిపై దృష్టి సారించింది. రోహిత్ రెడ్డి కాంటాక్ట్​లో ఉన్న రాకేష్ శర్మ, అభిషేక్ సింగ్‌లు కొకైన్ సరఫరా చేసినట్లు ఆధారాలు సేకరించిన సిట్, పూర్తి వివరాలతో కస్టడీ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది.