వాటర్ ట్యాంకెక్కిన అత్యాచార బాధితురాలు.. నిందితులను శిక్షించాలని డిమాండ్

వాటర్ ట్యాంకెక్కిన అత్యాచార బాధితురాలు.. నిందితులను శిక్షించాలని డిమాండ్

గోండ(ఉత్తరప్రదేశ్‌‌): తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌‌ చేస్తూ 18 ఏండ్ల యువతి వాటర్‌‌‌‌ ట్యాంక్‌‌ ఎక్కింది. కేసు నమోదు చేసి ఆరు నెలలైనా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్‌‌లోని గోండ జిల్లాలోని లమిత్‌‌ లాల్‌‌పూర్‌‌‌‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సంచార జాతికి చెందిన ఓ ఫ్యామిలీ 2023‌‌లో జిల్లాలోని లామ్టి లోల్‌‌పూర్‌‌‌‌ గ్రామానికి వచ్చారు. 

గతేడాది డిసెంబర్‌‌‌‌ 1న మలవిసర్జనకు బయటకు వెళ్లిన యువతిని.. అదే గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఉమేశ్‌‌ (24), దుర్గేశ్‌‌ (22), కుందన్‌‌ (18) బైక్‌‌పై వచ్చి ఎత్తుకెళ్లారు. తర్వాత ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు మంగళవారం కుటుంబసభ్యులతో డివిజనల్ కమిషనర్‌‌‌‌ ఆఫీసుకు వచ్చింది. 

పోలీసులు తన కేసును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆఫీసు పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ వాటర్‌‌‌‌ ట్యాంక్‌‌ ఎక్కి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేసింది. పోలీసులు నిందితులను కాపాడుతున్నారని ఆరోపించింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో 3 గంటల తర్వాత బాధితురాలు కిందికి దిగి వచ్చింది. 

అత్యాచారం జరిగినప్పుడు బాలిక మైనర్‌‌‌‌ అని, ఫిర్యాదును ధ్రువీకరించకపోవడంతో తుది నివేదికను దాఖలు చేయడంలో ఆలస్యం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు, కోర్టు ఆదేశాల మేరకు ఇదివరకే ముగ్గురు అన్నదమ్ములపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ రావత్‌‌ తెలిపారు.