
రంగారెడ్డి: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల EIPL రివర్ ఎడ్జ్ విల్లాస్ పక్కన కొండపై చిరుత కనపడింది. ఈ ఘటన కలకలం రేపింది. 51 విల్లాస్ యజమాని తన ఇంటిపై నుంచి సెల్ ఫోన్తో చిరుత పులిని ఫోటో తీశాడు. చిరుత సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఖరీదైన విల్లాలకు కేరాఫ్గా ఉన్న ప్రాంతాల్లో మంచిరేవుల ఒకటి.
గండిపేట్, కిస్మత్ పురా, మోకీలా, తెల్లాపూర్, మంచిరేవుల, కోకాపేట్, నెక్నాంపూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీప ప్రాంతాల్లో ఖరీదైన విల్లాలు కొనేందుకు నగరంలోని ధనవంతులు ఆసక్తి చూపుతున్నారు. సిటీలో రణగొణ ధ్వనులకు దూరంగా.. ప్రశాంతంగా ఉంటుందని మంచిరేవుల ఏరియాలో విల్లాలు కొనుక్కుని ఉంటుంటే.. చిరుత పులి సంచారం స్థానికులలో భయాందోళన రేకెత్తించింది.
నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్ క్యాంపస్‌లో కూడా చిరుత జాడను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత జాడ చిక్కింది. గత కొన్ని రోజులుగా చిరుత ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం ఉందని అధికారులు ధృవీకరించారు. ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో చిరుతను చూసినట్లు తెలపడంతో అధికారులు ఈ ప్రాంతంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత జాడ కోసం వేచి చూశారు.
►ALSO READ | స్థానిక రిజర్వేషన్లకు సర్వం సిద్ధం.. గవర్నర్ ఆమోదం తెలుపగానే కీలక ప్రకటన..?
ఎట్టకేలకు గురువారం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత జాడ చిక్కింది. రోడ్డు దాటుతూ చిరుత వెళ్లిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమైయ్యారు. నాలుగు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు మరో ఏడు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోనుల్లో మేక పిల్లలను ఎరగా పెట్టారు.
హైదరాబాద్ శివార్లలోకి వన్య ప్రాణులు ప్రవేశించడం ఇదే మొదటిసారి కాదు. కీసర, గండిపేట, శామీర్ పేట, రాజేంద్ర నగర్ ప్రాంతాలలో చిరుతపులి కనిపించిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. 2023లో హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఒక చిరుతపులి స్కూల్ దగ్గర తిరుగుతూ ఉంటే.. అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా ఆ చిరుత పులిని బంధించారు.