స్థానిక రిజర్వేషన్లకు సర్వం సిద్ధం.. గవర్నర్ ఆమోదం తెలుపగానే కీలక ప్రకటన..?

స్థానిక రిజర్వేషన్లకు సర్వం సిద్ధం.. గవర్నర్ ఆమోదం తెలుపగానే కీలక ప్రకటన..?

= రేపే స్థానిక రిజర్వేషన్లు?
= మరి కొద్ది గంటల్లో ముగియనున్న హైకోర్టు గడువు
= ఆర్డినెన్స్ పై గవర్నర్ న్యాయ సమీక్ష 
= కేంద్ర హోంశాఖ సలహా కోరిన జిష్ణుదేవ్ వర్మ
= గవర్నర్ ఆమోదం తెలుపగానే రిజర్వేషన్లపై కీలక ప్రకటన?
= సెప్టెంబర్ 30 లోగా ఎన్నికల నిర్వహణ!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు జూలై 25న ఖరారయ్యే అవకాశం ఉంది. హైకోర్టు విధించిన గడువు రేపటితో ముగుస్తుంది. రేపు రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపు పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను డెడికేటెడ్ కమిషన్ నుంచి తీసుకొని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ కేబినెట్ చేసిన ఆర్డినెన్స్ ప్రస్తుతం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వద్ద ఉంది. ఆయన దానిపై న్యాయ నిపుణులతో చర్చించారు.

తనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అదే తరుణంలో రాష్ట్ర  ప్రభుత్వ అధికారులతోనూ ఆయన మాట్లాడారు. తెలంగాణ అడ్వొకేట్ జనరల్‎తోనూ చర్చించారు. ఫైనల్‎గా మరో మారు న్యాయసలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపిచారు. దీంతో ఆర్డినెన్స్‎పై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా  బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే అంశంపై కేంద్రం సైతం ఇంత వరకు ఎలాంటి ముందడుగూ వేయలేదు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతోంది. 

ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకమే తరువాయి

ఇప్పటి వరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 22%  రిజర్వేషన్ మాత్రమే ఉంది. కులగణన చేపట్టిన ప్రభుత్వం 46శాతానికి పైగా బీసీలున్నట్టు తేల్చింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం చూస్తే.. అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి.  అందులో యాభై శాతానికి లోబడి అనే పదాన్ని తొలగిస్తూ ఈ నెల 10న కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ కు పంపింది. 

►ALSO READ | విద్యతోనే సోషల్ డెవలప్మెంట్..ఇంగ్లీషు ఇప్పుడు చాలా అవసరం

ఆయన న్యాయసమీక్ష చేస్తున్నారు. నిపుణులతోనూ చర్చించారు. ఇవాళ ఫైనల్‎గా  కేంద్ర హోంశాఖ కు న్యాయ సలహా కోసం పంపించడం గమనార్హం.  గవర్నర్ ఆర్డినెన్స్ పై సంతకం చేయగానే ఏ వర్గానికి ఎంతశాతం రిజర్వేషన్లు అనేది ఖరారు చేస్తూ హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయితే భారీగా మార్పులుండే అవకాశం ఉంది. గవర్నర్‌ ఆమోదం తెలిపితే రేపే రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. 

అందరి చూపు  రాజ్ భవన్ వైపు

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ పంపిన ఆర్డినెన్స్‎పై గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయాల్సి ఉంది. ఆయన సంతకం చేయకపోతే రిజర్వేషన్ల అంశం  మరోమారు అటకెక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్‌ పార్టీగా ప్రకటించే అభ్యర్థుల వరకు రిజర్వేషన్‌ను అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే పార్టీ ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తే కాంగ్రెస్‌ టికెట్లు 42 శాతం బీసీలకు ఇస్తుంది.