నయనతార కావాలె.. ఇస్తరా?... ‘మీ కలను చెప్పండి’ అనే సీఎం స్టాలిన్ స్కీమ్‌‌‌‌పై ఎంపీ షణ్ముగం సెటైర్లు

నయనతార కావాలె.. ఇస్తరా?... ‘మీ కలను చెప్పండి’ అనే సీఎం స్టాలిన్ స్కీమ్‌‌‌‌పై ఎంపీ షణ్ముగం సెటైర్లు
  •     భగ్గుమంటున్న మహిళా లోకం!

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెద్ద పంచాయితీ నడుస్తోంది. అన్నాడీఎంకే ఎంపీ, మాజీ మంత్రి సీవీ షణ్ముగం నోరు జారారు. సీఎం స్టాలిన్ పెట్టిన ‘మీ కలను చెప్పండి’ అనే ప్రోగ్రామ్‌‌‌‌ను ఎగతాళి చేయబోయి.. అసలుకే ఎసరు తెచ్చుకున్నారు. ఏకంగా స్టార్ హీరోయిన్ నయనతార పేరును లాగి అడ్డంగా బుక్కయ్యారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విల్లుపురంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 

‘‘ సీఎం స్టాలిన్ కండ్లు తెరిచి కొత్త స్కీమ్ పెట్టిండట.. మన కలను చెబితే నెరవేరుస్తాడట. మరి నాకు నయనతార కావాలె.. ఇస్తరా? సీఎం నయనతారతో పెండ్లి చేసి పెడతారా?” అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు ఐదేళ్లు ఏమీ చేయక.. ఇప్పుడు ఎన్నికల టైమ్ దగ్గర పడుతుంటే ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.

మహిళా నేతల సీరియస్​..

ఎంపీ షణ్ముగం చేసిన కామెంట్లపై మహిళానేతలు భగ్గుమంటున్నారు. ‘‘సంస్కారమే లేకుండా మహిళలను కించపరచడం అన్నాడీఎంకే వాళ్లకు అలవాటైపోయింది. ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్లపై ఆ పార్టీ బాస్ పళనిస్వామి చర్యలు తీసుకుంటాడని ఆశించడం కూడా దండగే” అంటూ డీఎంకే నేత కనిమొళి ట్విట్టర్ లో కడిగిపారేశారు.  ‘‘నయనతార అంటే ఒక సక్సెస్‌‌‌‌ఫుల్ నటి, ఒకరి భార్య, ఇద్దరు పిల్లల తల్లి.. ఇట్లాంటి అసభ్యకరమైన మాటలు ఎట్లా మాట్లాడ్తరు? పోలీసులు తక్షణమే షణ్ముగంపై కేసు పెట్టి లోపల వేయాలి” అంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి డిమాండ్ చేశారు.

పొరపాటైందన్న ఎంపీ..

తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండడంతో ఎంపీ షణ్ముగం ప్లేటు ఫిరాయించారు. ‘‘ఆ మాటలు పొరపాటున అన్నానని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు” అని చెప్పారు. అన్నా డీఎంకే పార్టీ పెద్దలు మాత్రం ఇది ఆయన వ్యక్తిగత మాటలని, పార్టీకి సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. గతంలో కూడా ‘‘స్టాలిన్ ఎన్నికల హామీగా పెళ్లాలను కూడా ఫ్రీగా ఇస్తాడేమో” అంటూ ఇదే షణ్ముగం అడ్డగోలుగా మాట్లాడి అభాసుపాలయ్యారు.