కరాచీ బేకరీ గోదాంలో భారీ పేలుడు.. 15 మందికి గాయాలు.. 8 మందికి సీరియస్‌

కరాచీ బేకరీ గోదాంలో భారీ పేలుడు.. 15 మందికి గాయాలు.. 8 మందికి సీరియస్‌
  • కరాచీ బేకరీ గోదాంలో భారీ పేలుడు
  • 15 మందికి గాయాలు.. 8 మందికి సీరియస్‌ 
  • గ్యాస్‌ లీక్‌ కావడంతో అంటుకున్న మంటలు
  • శంషాబాద్‌ గగన్‌పహాడ్‌లో ఘటన

హైదరాబాద్‌ / శంషాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం  కరాచీ బేకరీ గోదాంలో గ్యాస్ సిలిండర్‌ పైప్‌ లీకై పేలుడు సంభవించింది. దీంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో, శంషాబాద్‌లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

గగన్ పహాడ్ ఇండస్ట్రియల్‌ ఏరియాలో కరాచీ బేకరీ కోసం గోదాం ఏర్పాటు చేశారు. బేకరీలో అవసరమైన కేక్స్‌ సహా ఇతర ఫుడ్‌ ఐటెమ్స్‌ ఈ గోదాంలో తయారు అవుతుంటాయి. ఇక్కడ తయారైన ఐటెమ్స్‌ను హైదరాబాద్‌లోని కరాచీ బేకరీలకు తరలిస్తుంటారు. గోదాంలో ఉత్తరప్రదేశ్‌కి చెందిన 20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. గురువారం గోదాంలో బట్టి నిర్వహిస్తుండగా, ఆ పక్కనే ఉన్న గ్యాస్‌ సిలిండర్‌‌ పైప్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయింది. ఆ వెంటనే పక్కనే ఉన్న బట్టిలో మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్‌ ఒక్కసారిగా బ్లాస్ట్‌ అవ్వడంతో అక్కడే పనిచేస్తున్న 15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. 

భయంతో కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో బలరాం(25), శుభం ప్రజాపతి (19), ఆదిత్య కుమార్‌ ‌(19), సందీప్ ప్రజాపతి (27), దీపక్ శుక్లా(18), అమ్రేశ్‌ కుమార్‌‌ (20), ముఖేశ్‌ కుమార్(28), ధారా సింగ్ (37), సోను (30), కమల్ కిషోర్‌‌ (24), ప్రమోద్‌ కుమార్‌ ‌(19), సందీప్‌ కుమార్‌ ‌(35), సన్ని (20), ప్రదీప్‌ (27), సుజిత్‌ (19) గాయపడ్డారు. వీరందరూ యూపీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బేకరీ గోదాం యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. కాగా, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.