రియల్ దందా కోసం గన్ ​కొని పోలీసులకు అడ్డంగా దొరికిండు

రియల్ దందా కోసం గన్ ​కొని పోలీసులకు అడ్డంగా దొరికిండు
  •    నిందితుడు ముస్తాబాద్​ వాసి
  •     జగిత్యాల జిల్లా మల్యాలలో పట్టివేత 


మల్యాల, వెలుగు : రియల్ ఎస్టేట్ దందాలో ప్రత్యర్థులను బెదిరించడానికి ఓ వ్యక్తి లైసెన్స్ లేని తుపాకీ కొని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. జగిత్యాల డీఎస్పీ వెంకటస్వామి కథనం ప్రకారం...రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామానికి చెందిన మహేందర్ పదేండ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్​చేస్తున్నాడు. అప్పుడప్పుడు వివాదాలు ఏర్పడుతుండడంతో పరిష్కారం కోసం ప్రత్యర్థులను బెదిరించాలని అనుకున్నాడు. మామూలుగా చెప్తే వినరని వినేలా భయపడేట్టు చేయాలని భావించాడు. మూడేండ్ల క్రితం బిహార్​వెళ్లి రూ.యాబై వేలతో ఒక నాటు తుపాకి, ఆరు బుల్లెట్లు కొనుక్కొని వచ్చాడు. అప్పటి నుంచి ప్యాంట్ వెనక తుపాకి పెట్టుకొని తిరుగుతుండే వాడు. ఎవరైనా చెప్పినట్టు వినకపోతే తుపాకీ తీసి బెదిరించేవాడని సమాచారం. ఈ క్రమంలో మంగళవారం మహేందర్ జగిత్యాల నుంచి కరీంనగర్ కు బైక్​పై వెళ్తున్నాడు. మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద పోలీసులు రెగ్యులర్​తనిఖీలు చేస్తున్నారు. మల్యాల ఎస్ఐ కుమారస్వామి వాహనాలను తనిఖీ చేస్తుండడాన్ని గమనించిన మహేందర్​టూ వీలర్​వెనక్కి తిప్పి వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించి పట్టుకున్నారు. సోదా చేయగా తుపాకీ తో పాటు  ఆరు బుల్లెట్లు దొరికాయి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.