మద్యం తాగి కోర్టుకు వచ్చి.. ఆత్మహత్యాయత్నం

మద్యం తాగి కోర్టుకు వచ్చి.. ఆత్మహత్యాయత్నం

కూకట్​పల్లి, వెలుగు: ఆరేండ్లుగా ఓ కేసు విషయంలో తనకు న్యాయం జరగట్లేదని కూకట్​పల్లి కోర్టు ఆవరణలో ఓ వృద్ధుడు చెయ్యి కోసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్​బీ కాలనీ మూడో ఫేజ్​లో ఉండే సాల్మన్​రాజు(52) 2008లో ప్రశాంత్​నగర్​లో ఒక షెడ్డు అద్దెకు తీసుకుని ఫ్యాబ్రికేషన్ వర్క్​షాపు నడిపేవాడు. కొన్నేండ్లు బిజినెస్ ​మంచిగా సాగగా, 2015 నాటికి నష్టాలు వచ్చాయి. దీంతో షెడ్డు యజమాని రామకృష్ణకు ఏడాది పాటు రెంట్ కట్టలేకపోయాడు. కొన్నాళ్లు సాల్మన్ ​రాజు షెడ్డు క్లోజ్​ చేశాడు. ఆ టైంలో యజమాని రెంట్ కోసం ఒత్తిడి చేశాడు. తర్వాత రామకృష్ణ షెడ్డును కూలగొట్టాడు. విషయం తెలుసుకున్న సాల్మన్ ​రాజు 2016 అక్టోబర్​ఒకటో తేదీన కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

షెడ్డులోని తన సామగ్రి షెడ్డు యజమాని మాయం చేశాడని అందులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణను అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. అప్పటి నుంచి కేసు కోర్టులో ఉంది. ఆరేండ్లు దాటినా తనకు న్యాయం జరగడం లేదని సోమవారం మధ్యాహ్నం మద్యం తాగి కూకట్​పల్లి కోర్టుకు వచ్చాడు. పీపీ చాంబర్​ వద్ద గొంతు కోసుకోవటానికి ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న లాయర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం సాల్మన్​రాజు గాంధీ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు.