చేయని తప్పుకు కుల బహిష్కరణ.. సెల్ఫీ వీడియో తీసి యువకుడు సూసైడ్

చేయని తప్పుకు కుల బహిష్కరణ.. సెల్ఫీ వీడియో తీసి యువకుడు సూసైడ్

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది.  అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ లో గ్రామ పెద్దల నిర్ణయం ఓ నిండు ప్రాణం తీసింది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్  అనే యువకుడి కుటుంబాన్ని కుల బహిష్కారణ చేశారు పెద్దలు. దీనికి సంబంధించి గ్రామానికి చెందిన ముగ్గురు కుల పెద్దలపై  జనవరి 6 న అల్లదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయినా  పోలీసులు పట్టించుకోవడం లేదని మనస్థాపానికి గురైన ఇప్ప శంకర్… అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పొలం దగ్గర చెట్టుకు ఉరి వేసుకున్నాడు.  ఆత్మహత్య చేసుకొనే ముందు తన ఆవేదనను చెబుతూ వీడియో రికార్డ్ చేశాడు బాధితుడు.కుల పెద్దలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన చావుకు కుల పెద్దలు, అల్లాదుర్గ్ పోలీసులే కారణమని చెప్పాడు.

2005 లో మర్డర్ కేస్ లో నలుగురితో పాటు ఇప్ప శంకర్ నిందితుడిగా  ఉన్నాడు. ఆ కేసు క్లియర్ అయి ఊర్లోకి వచ్చిన తరువాత… కుల పెద్దలు శంకర్ కు 5 లక్షల జరిమాన వేశారు. ఆ జరిమాన కట్టలేక ఊరి నుంచి  వెళ్లిపోయాడు. ఈ మధ్యే పెళ్లి చేసుకొని ఊర్లోకి వచ్చాడు. కుల పెద్దలు మళ్లీ ఇబ్బందులు పెట్టడంతో జనవరి 6 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు శంకర్. కుల సంఘం ఇబ్బందులతో పాటు… ఇంట్లో సమస్యలతో కట్టుకున్న భార్య శంకర్ ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో  పొలం దగ్గరకు వెళ్లి ఇప్ప శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఘటనాస్థలిలో మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శంకర్ మృతితో  గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.