మాకు తెల్వకుండనే మా భూమి అమ్మేసిన్రు

మాకు తెల్వకుండనే మా భూమి అమ్మేసిన్రు
  •  తహసీల్దార్​ ఆఫీసు ముందు వ్యక్తి అర్ధనగ్న ప్రదర్శన

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: తమ భూమి విషయంలో అధికారులు అన్యాయం చేశారని, తనకు న్యాయం చేసి భూమి ఇప్పించాలని కోరుతూ ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సైదాబాద్​కు చెందిన గంగిరెడ్డి గిరిధర్​రెడ్డి శుక్రవారం అబ్దుల్లాపూర్​ మెట్ తహసీల్దార్​ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపాడు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం తట్టిఅన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 109, 110లో తన తండ్రి పేరుపై 6 ఎకరాల భూమి ఉందన్నారు. దీనికి సంబంధించి 2000 ఏడాది నుంచి కోర్టులో కేసు నడుస్తుండగా, 2016లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. తమకు పాస్​బుక్కులు కూడా వచ్చాయన్నారు. కానీ 2022లో ఆ భూమిని అమోద డెవలపర్స్ అనే సంస్థకు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్​ కలిసి కట్టబెట్టారని ఆరోపించారు. 

కోర్టు స్టేటస్​కోను లెక్కచేయకుండా వారికి పాసుపుస్తకాలు ఇచ్చి ధరణిలో రికార్డులు మార్చారన్నారు. ఈ విషయమై అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. నిరసన విషయాన్ని తెలుసుకున్న ప్రస్తుత తహసీల్దార్​ సుదర్శన్ రెడ్డి అక్కడికి చేరుకుని ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు.