కేసముద్రం, వెలుగు : రైల్వే స్టేషన్లలో పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లొద్దని ఆఫీసర్లు, సిబ్బంది ఎంత చెప్పినా కొందరు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా.. పట్టాలు దాటేందుకు యత్నించిన ఓ వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగింది.
ఓ వ్యక్తి ఫస్ట్ ప్లాట్‌ఫాం పైనుంచి పట్టాల మీదుగా రెండో ప్లాట్‌ఫాం వైపు వెళ్తున్నాడు. ఇదే సమయంలో గూడ్స్ రైలు రాగా అక్కడే అగిపోయాడు. తర్వాత గూడ్స్ నిలిచిపోవడంతో దాని కింది నుంచి అవతలి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా రైలు ఒక్కసారిగా కదిలింది.
అక్కడే ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో ఆ వక్తి పట్టాల మధ్యే కదలకుండా పడుకున్నాడు. రెండు వ్యాగన్లు దాటిన తర్వాత రైలు మరోసారి నిలిచిపోవడంతో ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.
