ఆస్తి తగాదాతో వ్యక్తి హత్య

ఆస్తి తగాదాతో వ్యక్తి హత్య

మెహిదీపట్నం, వెలుగు: ఆస్తి తగాదాలతో పాతబస్తీలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మంగళహాట్​లోని టక్కరివాడి ప్రాంతానికి చెందిన జగదీశ్, రఘువీర్ సింగ్ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. జగదీశ్ కొడుకు దుర్గేశ్ సింగ్(40) ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, రఘువీర్ కుమారుడు బజరంగ్ సింగ్ స్థానికంగా టీ స్టాల్ నడుపుతున్నాడు.

బజరంగ్ తన సమీప బంధువులు తుల్జారామ్ సింగ్ (చేతన్), సత్యనారాయణ సింగ్ (టింకు)తో కలిసి ఆదివారం రాత్రి దుర్గేశ్​కు ఫోన్ చేశాడు. మాట్లాడుకుందామని పిలవడంతో దుర్గేశ్ సింగ్ బయటకు వచ్చాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు కలిసి ఆస్తి తగాదాల విషయంలో అతడితో గొడవ పడి దాడి చేశారు. ఈ ఘటనలో కిందపడి తలకు గాయం కావడంతో దుర్గేశ్ మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళహాట్ సీఐ మహేశ్ తెలిపారు.