ఏజెంట్‌‌ను  కలిసి వస్తానని వెళ్లి శవమైండు

ఏజెంట్‌‌ను  కలిసి వస్తానని వెళ్లి శవమైండు

పాపన్నపేట, వెలుగు : విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్‌‌ను కలిసి వస్తానని వెళ్లిన వ్యక్తి నెల తర్వాత శవమై కనిపించాడు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా పాపన్నపేటలో వెలుగు చూసింది. ఎస్సై విజయ్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... పాపన్నపేటకు చెందిన పోచమ్మకాడి రమేశ్‌‌ (38) చేపలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఏజెంట్‌‌ను కలిసేందుకు వెళ్తానని చెప్పి గత నెల 10న ఢిల్లీకి బయల్దేరాడు. తర్వాతి రోజు కుటుంబసభ్యులతో మాట్లాడిన కొద్ది సేపటికే ఫోన్‌‌ స్విచాఫ్‌‌ అయింది. అప్పటి నుంచి అతడి ఆచూకీ లేకపోవడంతో రమేశ్ కనిపించడం లేదని మార్చి 17న అతడి కుటుంబ సభ్యులు పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్‌‌ నంబర్‌‌ ఆధారంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు రమేశ్‌‌ ఫోన్‌‌ను మధ్యప్రదేశ్‌‌లోని మోరెనా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వాడుతున్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి  వెళ్లి ఎంక్వైరీ చేశారు. మొరెనా పట్టణంలోని సివిలియన్ పీఎస్‌‌ పరిధిలో మార్చి 13న రమేశ్‌‌ దుస్తులు లేకుండా తిరిగాడని, అదే రోజు ఫిట్స్‌‌తో చనిపోయాడని అక్కడి పోలీసులు చెప్పారు. గుర్తు తెలియని డెడ్‌‌బాడీగా భావించి పూడ్చి పెట్టినట్లు తెలిపారు. దీంతో డెడ్‌‌బాడీని వెలికితీసి సోమవారం పాపన్నపేటకు తీసుకొచ్చారు. రమేశ్‌‌ మృతిపై మధ్యప్రదేశ్‌‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్సై విజయ్‌‌కుమార్‌‌ తెలిపారు.