బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి .. 20 ఏండ్ల కఠిన కారాగారం

బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి .. 20 ఏండ్ల కఠిన కారాగారం
  • వరంగల్  పోక్సో స్పెషల్  కోర్టు తీర్పు
  • బాధితురాలికి రూ.5.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం

హనుమకొండ, వెలుగు : మానసిక వికలాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి వరంగల్  పోక్సో  స్పెషల్  కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలికి పరిహారంగా రూ.5.5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోక్సో కోర్టు పీపీ మొలుగూరి రంజిత్​ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్  జిల్లా మామునూరు పీఎస్​ పరిధికి చెందిన మానసిక వికలాంగురాలిపై తేజావత్​ హచ్చు అనే యువకుడు 2019 నవంబర్  6న అత్యాచారం చేశాడు.

ఇంట్లో ఎవరూలేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు సైగలతో తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె పేరెంట్స్​ నవంబర్​ 7న మామునూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాధితురాలికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పోక్సో కోర్టు పీపీ మొలుగూరి రంజిత్ ​ స్పెషల్​ ఎడ్యుకేటర్స్​తో విచారణ  చేపట్టి, సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో తేజావత్  హచ్చును వరంగల్   పోక్సో స్పెషల్​ కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి కోర్టు ఇన్​చార్జి​జడ్జి సత్యేంద్ర 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. దానితో పాటు బాధితురాలికి రూ.5.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.