ఆ అమ్మాయి నాదే.. నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకో

ఆ అమ్మాయి నాదే.. నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకో
  • నిశ్చితార్థం జరిగిన అమ్మాయి పెళ్లి చెడగొట్టిన కామాంధుడు

వికారాబాద్: ఇంటి పక్కనే నివాసం ఉంటూ.. మంచి వాడిగా నటిస్తూ ఓ అమ్మయిని ట్రాప్ చేసి పేళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేసిన వివాహితుడు.. బరితెగించి నిశ్చితార్థం జరిగిన అబ్బాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి నాదే.. నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని బెదిరించాడు. తాను వివాహితుడినే అయినా.. తనతో కలసి తిరిగిందని.. ఆమెను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని తరచూ ఫోన్ చేసి చెబుతూ.. ఏకంగా నిశ్చితార్ధం రద్దు చేసుకునేలా ప్రవర్తించాడు. పక్కింటి వ్యక్తే..పైగా తండ్రి వయసున్నవాడు.. ప్రభుత్వ ఉద్యోగి అని మిన్నకుండిపోతే.. ఏకంగా నిశ్చితార్థం జరిగిన అమ్మాయి పెళ్లి రద్దు చేయించడంతో బాధితురాలు.. ఆమె తల్లిదండ్రులు కంటతడిపెట్టుకుని బోరుమని విలపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. పరిగి ప్రభుత్వ అసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటేశ్ (48) అనే కామాంధుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన ఉద్యోగం.. డబ్బుతో అందంగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేయడం అతనికి అలవాటు. దాదాపు తన కూతురు వయసున్న తన ఇంటి 25 సంవత్సరాల యువతిపై కామాంధుడి కన్ను పడింది. రాకపోకలపై నిత్యం నిఘా వేసి.. చిన్న చితక పనులు చేసి చేదోడు వాదోడుగా నిలుస్తూ.. మంచివాడనే నమ్మకం సంపాదించుకున్నాడు. తన రాకపోకలపై అమ్మాయి కుటుంబ సభ్యులెవరికీ అనుమానం రాకుండా చూసుకున్నాడు. అమ్మయితో రోజూ మాట్లాడుతూ ట్రాప్ లోకి దింపాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న వివాహితుడు, ఇంచుమించు తండ్రి సమాన వయసున్న వ్యక్తి అనే విషయం మరచిపోయి తనను పెళ్లి చేసుకోమని వేధించడం ప్రారంభించాడు. అమ్మాయికి ఎస్జీటీ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ఇంటి వద్ద ఉండకుండా ఉద్యోగానికి వెళ్తున్నా వదిలిపెట్టకుండా అమ్మాయి పని చేస్తున్న స్కూల్ కి వెళ్లి వేధించడం మొదలుపెట్టాడు. దీనిపై పలు మార్లు పెద్దలు అతన్ని పిలిచి మందలించి, నచ్చ చెబితే, సరే మళ్లీ మీ అమ్మాయి జోలికి వెళ్లనని చెప్పి రెండ్రోజులు పోయాక మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసి గత డిసెంబర్ నెలలో మరో యువకునితో పెళ్లి జరిపించుంకు నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. వచ్చే మే నెల 17న సదరు యువకుడితో  పెళ్లి జరిపించాలని ఖరారు చేసుకున్నారు. ఈ విషయం తెలిసినా వెంకటేష్ వెంటపడుతూనే ఉన్నాడు. వేరేవేరే నెంబర్లతో అమ్మాయికి ఫోన్ చేసి అతన్ని పెళ్లి చేసుకోకు, నేను నిన్ను చేసుకుంటానని ప్రతి రోజు వేంకటేష్ వేధించాడు. అంతటితో ఆగకుండా నిశ్చితార్ధం చేసుకున్న అబ్బాయి వివరాలు తెలుసుకుని అతనికి కూడా ఫోన్ చేసి నేను ఆ అమ్మాయిని చేసుకుంటున్నా..  నువ్వు పెళ్లి క్యాన్సల్ చేసుకో.. అంటూ పలు మార్లు ఆబ్బాయికి ఫోన్లు చేసి బెదిరించాడు. ఇతని టార్చర్ భరించలేక పెళ్లి ఖాయం చేసుకున్న పెళ్లి కొడుకు  వారు తమకు ఈ పెళ్లి వద్దు అంటూ వెళ్లిపోవడంతో అమ్మాయి కుటుంబీకులు కుప్పకూలిపోయారు. అతని టార్చర్ వల్ల తమ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్లి కుంగిపోతుండడంతో భరించలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. కామాంధుడి నుంచి కాపాడాలని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇలా వేధిస్తున్న అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భాధితురాలు తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది.