మల్లంపేట్‌లో ఇంట్లో పేలిన ఏసీ.. భారీగా చెలరేగిన మంటలు

మల్లంపేట్‌లో  ఇంట్లో పేలిన ఏసీ.. భారీగా చెలరేగిన మంటలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అర్ధరాత్రి వేళ భారీ అగ్నిప్రమాదం కలకలం సృష్టించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ-2 లో ఉన్న ఓ నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏసీ పేలిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఇల్లంతా దట్టమైన పొగలు, మంటలు అలుముకున్నాయి. ప్రమాద తీవ్రతకు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారు అప్రమత్తం కావడంతో.. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు, చుట్టుపక్కల జనాలు ఊపిరి పీల్చుకున్నారు.