హైకమాండ్ సూచనతోనే బస్సు యాత్ర

హైకమాండ్ సూచనతోనే బస్సు యాత్ర
  • హైకమాండ్ సూచనతోనే బస్సు యాత్ర
  • దసరాకు ముందా.. తర్వాతా అన్నది త్వరలో చెప్తం: రేవంత్​
  • సీట్ల కేటాయింపులో సీనియర్లకు అన్యాయం జరగనివ్వం
  • కొందరు ఆఫీసర్లు బీఆర్ఎస్​కు కొమ్ముకాస్తున్నరని ఫైర్
  • గాంధీభవన్​లో పీఏసీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ తన తండ్రి కేసీఆర్​ను జంతువుతో సరిగ్గా పోల్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నరమాంసానికి అలవాటు పడిన కుటుంబం.. పులులతో పోల్చుకుంటున్నదని ఎద్దేవా చేశారు. మంగళవారం గాంధీభవన్​లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిర్వహించారు. తర్వాత మధుయాష్కీ, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బస్సుయాత్రపై  చర్చించినట్టు చెప్పారు. యాత్రపై రెండు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు చేయడమా.. లేదా దసరా అయ్యాక 25వ తేదీ నుంచి ఎన్నికల వరకు నిర్వహించడమా అన్న దానిపై చర్చ జరిగిందని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు వెళ్లాలా లేదంటే బస్సు యాత్ర మొదలుపెట్టి లిస్టు ప్రకటించాలా అన్నదానిపై చర్చ జరిగిందన్నారు. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. జాతీయ నాయకత్వం సూచనల మేరకే బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అందరికి ఆమోదయోగ్యంగానే సీట్ల ప్రకటన

అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా సీట్ల ప్రకటన ఉంటుందని రేవంత్ చెప్పారు. అభ్యర్థులను ప్రకటించేంత వరకు సంయమనం పాటించాలన్నారు. సమర్థులైన నాయకులను సంప్రదించాకే అభ్యర్థుల ప్రకటనపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీనియర్ నాయకుల హోదాలు, గౌరవం తగ్గకుండా నిర్ణయం ఉంటుందని, అందుకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ కమిటీ వేశారని తెలిపారు. కమిటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, జానా రెడ్డి, మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్షి సభ్యులుగా ఉంటారని, వారు సీనియర్ లీడర్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని చెప్పారు. పొత్తుల అంశం కూడా ఇప్పటికీ చర్చల దశలోనే ఉందని, నిర్ణయాలేవైనా తీసుకుంటే చెప్తామని అన్నారు.

కేసీఆర్ అధికార దుర్వినియోగం

కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆ విషయంలో చూస్తూ ఊరుకోబోమని రేవంత్ హె చ్చరించారు. చట్టంలో లొసుగులు వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్​కు కొందరు అధికారులు కొమ్ముకాస్తున్నారని అలాంటి అధికారులపై పీఏసీలో చర్చించామని తెలిపారు. రూల్స్​ను బేఖాతరు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్​కు కొమ్ముకాసే ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్, రెవెన్యూ సహా అన్ని విభాగాల అధికారుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. దానికోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించామని, రూల్స్ ఉల్లంఘించే అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ కమిటీ ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్​కు ఆరు నెలల ముందు ప్రభుత్వం వేసిన అన్ని టెండర్లపైనా అధికారంలోకి రాగానే సమీక్షిస్తామన్నారు. భూముల అమ్మకాలపైనా రివ్యూ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకీ ప్రకటనల కోసం మెట్రో స్పేస్ ఇవ్వాలని కోరారు.

కమ్యూనిస్టులతో చర్చలు జరుగుతున్నయ్: భట్టి

కమ్యూనిస్టు పార్టీలకు సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. వాళ్లు అడుగుతున్న స్థానాలు, తాము ఇస్తామంటున్న సీట్లపై చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయన్నారు. పొత్తులపై హైకమాండ్ ప్రకటన చేస్తుందని తెలిపారు. కులగణనపై రాహుల్ గాంధీ తీర్మానం చేశారని, సీడబ్ల్యూసీ సమావేశాల్లోనూ దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అభ్యర్థుల లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదన్నారు. ఎన్నికల రూల్స్ ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.