ద్రాక్ష తోట మధ్యలో మెఫెడ్రోన్‌ తయారీ ఫ్యాక్టరీ

ద్రాక్ష తోట మధ్యలో మెఫెడ్రోన్‌ తయారీ ఫ్యాక్టరీ
  •      245 కోట్ల విలువైన 122 కిలోల డ్రగ్ సీజ్.. 
  •      ఆరుగురిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

ముంబై : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఇరాలి గ్రామంలో ఓ ద్రాక్ష తోట మధ్యలో మెఫెడ్రోన్ తయారీ ఫ్యాక్టరీని ముంబై పోలీసులు గుర్తించారు. అందులో సెర్చ్ నిర్వహించగా 122.5 కిలోల మెఫెడ్రోన్ పట్టుబడింది. దీని విలువ రూ. 245 కోట్లు ఉంటుందని అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అందులో ఐదుగురు సాంగ్లీకి చెందిన రైతులని.. ప్రవీణ్ షిండే(34) అనే వ్యక్తి ప్రధాన నిందితుడని వివరించారు. నిందితులు ఇరాలి గ్రామంలో12 ఎకరాలు కొని..ద్రాక్ష పంట సాగుచేస్తున్నారని చెప్పారు.

 ఎవరికీ అనుమానం రాకుండా తోట మధ్యలో డ్రగ్స్ తయారీ చేస్తున్నారని తెలిపారు.  ఫ్యాక్టరీలో స్వాధీనం చేసుకున్న మెఫెడ్రోన్ క్రిస్టల్ రూపంలో ఉందన్నారు. ప్రవీణ్ షిండే కిలో డ్రగ్‌కి లక్ష రూపాయలు సంపాదించాడని వెల్లడించారు. సిండికేట్‌లో ప్రమేయం ఉన్న మరికొందరి ఆచూకీ కోసం దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న ముంబైలోని కుర్లాలో ఓ మహిళతో సహా ఇద్దరు డ్రగ్స్‌ వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు.

 వారి నుంచి రూ.7 కోట్ల విలువైన 3.6 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గుజరాత్‌లోని సూరత్‌లో మరో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. మహారాష్ట్రలో గత ఏడు నెలల్లో డ్రగ్స్ తయారీ సిండికేట్‌కు చెందిన 10 మందిని అరెస్టు చేశామని.. రూ. 252.55 కోట్ల విలువైన 126.141 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిటెక్షన్) దత్తా నలవాడే పేర్కొన్నారు.