పోలెండ్​పై మిసైల్ దాడి!

పోలెండ్​పై మిసైల్ దాడి!

పోలెండ్​పై మిసైల్ దాడి!

ఉక్రెయిన్ బార్డర్ దగ్గర్లోని గ్రామంపై పడ్డ మిసైల్​

వార్సా : పోలెండ్ పై మిసైల్ దాడి జరిగింది. ఉక్రెయిన్ బార్డర్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలోకి మంగళవారం మధ్యాహ్నం మిసైల్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మంగళవారం రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. రెండు దేశాలు పోటాపోటీగా మిసైళ్లను ప్రయోగించాయి. ఈ క్రమంలో మిసైల్ ఒకటి పోలెండ్ లో పడి ఉంటుందని భావిస్తున్నారు. ఇది అనుకోకుండానే జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా చేసిన దాడినా? అనేది తెలియలేదు. తమ దేశంలో పడిన మిసైల్​ను మేడిన్​ రష్యాదని పోలెండ్ ప్రకటించింది. అది సోవియట్ కాలం నాటి ఎస్–300 మిసైల్ అని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని రష్యా అంబాసిడర్ కు సమన్లు జారీ చేశామని చెప్పింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, తమ మిలటరీని అలర్ట్ లో ఉంచామని పేర్కొంది. ఈ దాడి రష్యానే చేసినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే అది ఉక్రెయిన్ ప్రయోగించిన మిసైల్​గా భావిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు.

ఈ దాడి తాము చేయలేదని రష్యా, ఉక్రెయిన్ ప్రకటించాయి. దీనికి కారణం ‘‘మీరంటే మీరే’’ అని రెండు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి. ‘‘నాటో దేశమైన పోలెండ్​పై రష్యా దాడి చేసింది. ఇది మరింత ఉద్రిక్తమైన పరిస్థితి” ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. పోలెండ్ టార్గెట్ గా తాము దాడి చేయలేదని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఆ మిసైల్ ఉక్రెయిన్ దేనని ఆరోపించింది. 

బైడెన్ ఎమర్జెన్సీ మీటింగ్.. 

పోలెండ్ పై మిసైల్ దాడి జరగడంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. నాటో దేశాలు యుద్ధంలోకి దిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. జి20 గ్రూప్ సమిట్ కోసం ఇండోనేషియాలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. జి20, నాటో దేశాల లీడర్లతో బుధవారం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. మిసైల్ ను రష్యా ప్రయోగించి ఉండకపోవచ్చని ఆయన అన్నారు. పోలెండ్ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ డుడాతో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటనపై దర్యాప్తుకు సహకారం అందజేస్తామన్నారు. నాటో దేశాల భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మరోవైపు బెల్జియంలోని బ్రస్సెల్స్ లో 30 నాటో దేశాల అంబాసిడర్లు సమావేశమయ్యారు. 

అనుకోకుండా జరిగి ఉండొచ్చు.. 

ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టకర ఘటన అయి ఉండొచ్చని పోలెండ్​ ప్రెసిడెంట్​ ఆండ్రెజ్ డుడా చెప్పారు. మిసైల్​ను ఉక్రెయిన్ ప్రయోగించి ఉండొచ్చన్నారు. ఉద్దేశపూర్వక దాడి అని గానీ, చేసింది రష్యానే అని గానీ చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.