
అమ్మకాలను పెంచుకోవడానికి వ్యాపారులు కస్టమర్లకు రక రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ముఖ్యంగా పండగల సీజన్లలో ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. యూపీలో ఓ స్మార్ట్ ఫోన్ యజమాని తన ఫోన్ల అమ్మకాలను పెంచుకునేందుకు ఊహించని ఆఫర్ ప్రకటించాడు. అతని ఆఫర్తో షాప్ కు జనాలు పోటెత్తారు. చివరకు అరెస్ట్ అయి కటకటాల పాలయ్యాడు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది.
ఆఫర్ ఏందంటే..?
ఉత్తరప్రదేశ్‌లో బదోహీ జిల్లాకు చెందిన రాజేశ్ మౌర్య మొబైల్ ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే హోలీ పండగ కావడంతో బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు తన షాపులో ఫోన్లు కొనుగోలు చేస్తే రెండు బీర్లు ఉచితంగా ఇస్తానని వెల్లడించాడు. ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వ్యాపించింది. దీంతో మొబైల్ షాపుకు జనం పోటెత్తారు. షాప్ ముందు జనం క్యూ కట్టడంతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ అనిల్ కుమార్ రాజేశ్ మౌర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో షాపు వద్దకు చేరుకున్న పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. ఐపీసీ సెక్షన్ 151 (ప్రజా శాంతికి భంగం కలిగించడం) కింద మౌర్యను అరెస్టు చేశారు. అంతేకాదు అతని దుకాణానికి సీల్ వేశారు.