అమ‌రుడైన‌ క‌ల్న‌ల్ సంతోష్‌పై ఓ అమ్మ పాట: ఎదురు చూస్తున్నా కొడుకా అంటూ కంట‌త‌డి..

అమ‌రుడైన‌ క‌ల్న‌ల్ సంతోష్‌పై ఓ అమ్మ పాట: ఎదురు చూస్తున్నా కొడుకా అంటూ కంట‌త‌డి..

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రుడైన తెలంగాణ బిడ్డ క‌ల్న‌ల్ సంతోష్ బాబుకు ఓ అమ్మ త‌న పాట‌తో నివాళి అర్పించింది. ఏడ‌బోయినావు కొడుకో అంటూ ఆమె పాడిన పాట భావోద్వేగంతో అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది. ఎంతో ముద్దుగా పెంచుకున్న బిడ్డ‌ను కోల్పోయిన సంతోష్ త‌ల్లి బాధ‌ను ఆ మ‌హిళ పాట రూపంలో వ్య‌క్త‌ప‌రిచింది. “గావురాల కొడుకా.. రారా ఒక్క ముద్ద పెడుతా తినిపోరా.. చంద‌మామ రావే అంటూ నేను ఆనాడు పాడిన పాట.. గుండె మీద పోయిన నిదుర నీకు గుర్తురాలేదా కొడుకా.. క‌న్న‌త‌ల్లి ఒడిని వీడి.. నేల‌త‌ల్లి ఒడి చేరుతావా” అంటూ ఆ అమ్మ ఆవేద‌న‌ను పాట‌లో చెప్పింది. ఈ అమ్మ గుర్తుకు రాలేదా అంటూ అమ్మ చిన్నత‌నంలో లాలించిన తీరును చెప్పిందామె. ఆర్మీలో సేవ‌లందిస్తున్న‌ జ‌వాన్ల కుటుంబాల ప‌రిస్థితిని క‌ళ్ల‌కు క‌డుతూ ఏ తోవ‌న వ‌స్తున్నావ‌ని ఎదురు చూస్తున్నా కొడుకా అంటూ కంట‌త‌డి పెట్టించింది. స‌రిహ‌ద్దుల్లో దేశ సేవ చేస్తూ ప్రాణాల‌ర్పించిన అమ‌రుడైనావా బిడ్డా అంటూ త‌లుస్తూ ఆ కుటుంబం గ‌ర్వ‌ప‌డుతున్న తీరునూ చెప్పుకొచ్చింది ఆ త‌ల్లి.

ప్ర‌తి ఒక్క‌రినీ భావోద్వేగానికి గురి చేస్తున్న ఆ పాట..

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలో సోమ‌వారం రాత్రి చైనా సైనికులు భార‌త భూభాగంలోకి చొచ్చుకుని రావ‌డంతో భార‌త బ‌ల‌గాలు అడ్డుకున్నాయి. ఈ స‌మ‌యంలో రెండు దేశాల జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చైనా సైనికులు రాళ్లు, ఇనుప‌రాడ్ల‌తో దాడికి దిగడంతో ప‌లువురు భార‌త జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులయ్యారు. అయితే గాల్వాన్ లోయ వ‌ద్ద భార‌త భూభాగంలోకి చొచ్చుకుని వ‌చ్చి దాడికి పాల్ప‌డిన స‌మ‌యంలో మ‌న జ‌వాన్లు గ‌ట్టిగా ప్ర‌తిఘ‌టించారు. ప్ర‌తి దాడిలో చైనా ఆర్మీ క‌మాండింగ్ ఆఫీస‌ర్ స‌హా 40 మంది వ‌ర‌కు సైనికులు మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై చైనా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.