సాధారణ కాన్పుల పేరిట పసిపిల్లల ఉసురు తీసిన్రు

సాధారణ కాన్పుల పేరిట పసిపిల్లల ఉసురు తీసిన్రు
  • సాధారణ కాన్పుల పేరిట
  • పసిపిల్లల ఉసురు తీసిన్రు
  • పుట్టకుండానే గాలిలో
  • కలిసిన  రెండు ప్రాణాలు 
  • సిరిసిల్లలో బంధువుల ఆందోళన 
  • బాధ్యులపై చర్యలుంటాయన్న సూపరింటెండెంట్​
  • భద్రాచలంలో దవాఖానా  స్టాఫ్​పై బాధితుల కంప్లయింట్​

 

సిరిసిల్ల టౌన్, వెలుగు :  తొలి కాన్పు నార్మల్ ​డెలివరీ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. ఉద్దేశం మంచిదే అయినా డాక్టర్లు, సిబ్బంది అత్యుత్సాహానికి పోతున్నారు. సిజేరియన్​ చేయాల్సిన సందర్భాల్లోను సాధారణ ప్రసవాలకు ప్రయత్నాలు చేస్తూ పసికందుల ఊపిరి తీస్తున్నారు.   

నొప్పులు ఎక్కువున్నాయని చెప్పినా వినలే..

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో శుక్రవారం నార్మల్​ డెలివరీ చేస్తుండగా ఓ శిశువు చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందని బంధువులు ఆందోళన చేశారు. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య ప్రియాంకను గురువారం డెలివరీ కోసం సిరిసిల్ల ఏరియా దవాఖానాకు తీసుకువచ్చారు. మొదటి కాన్పు కావడంతో నార్మల్ ​డెలివరీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో డాక్టర్ పల్లవి ఆమెను చెక్ చేసి అబ్జర్వేషన్​లో ఉంచారు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు డెలివరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లారు.  పాపను బయటకు తీసే క్రమంలో చనిపోయింది. ఈ విషయాన్ని ప్రియాంక బంధువులకు చెప్పలేదు. కొంత టైం తర్వాత ప్రియాంక బంధువులు నిలదీయగా అసలు విషయం బయట పెట్టారు.  

సీఎం నుంచి సంతకం తీసుకరాపో...

డెలివరీ టైంలో ప్రియాంక నొప్పులను తట్టుకోవడం లేదని, ఆపరేషన్​ చేయాలని డాక్టర్లను కోరగా ‘సీఎం కేసీఆర్​దగ్గరి నుంచి సంతకం తీసుకుని రాపో చేస్తం' అని డాక్టర్​పల్లవితో పాటు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని బంధువులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని దవాఖానాలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ​మురళీధర్​రావు​తో వాగ్వాదానికి దిగారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్​, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. విషయం తెలుసుకుని దవాఖానాకు వచ్చిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి నిరసన తెలిపారు. కేటీఆర్​ నియోజకవర్గంలో పేరుకే పెద్ద దవాఖానా ఉందని, కానీ ఒక్క డాక్టర్​కూడా అందుబాటులో ఉండరన్నారు. ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఆపరేషన్​ చేయాలనికాళ్లు మొక్కినా డాక్టర్లు కనికరించకపోవడం దారుణమన్నారు.  సీఐ అనిల్​కుమార్​ అక్కడికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.   

భద్రాచలంలోనూ ఇదే తీరు..

కడుపులోనే మృతిచెందిన శిశువు 

భద్రాచలం : నొప్పులు వస్తున్నా, బ్లీడింగ్​అవుతున్నా సాధారణ కాన్పు కోసం రోజుల తరబడి దవాఖానాలో ఉంచుకోవడంతో ఆ తల్లి తీవ్ర ప్రసవ వేదనను అనుభవించింది. అయినా తన బిడ్డను దక్కించుకోలేకపోయింది. ఇరపా విజయకుమారి తొలికాన్పు కోసం పుట్టినిల్లయిన మణుగూరు నుంచి ఈనెల 4న భద్రాచలం ఏరియా దవాఖానాకు వచ్చింది. డాక్టర్లు పరీక్షలు చేసి 6న డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే ఆమెకు నొప్పులు ఎక్కువై బ్లీడింగ్​అయినా సాధారణ కాన్పే చేస్తామంటూ మిడ్​వైఫ్​ స్టాఫ్​ ఆపారు. గురువారం రాత్రి విపరీతంగా నొప్పులు రావడంతో సిజేరియన్​ చేయగా అప్పటికే పరిస్థితి విషమించి శిశువు కడుపులోనే చనిపోయింది. దీంతో విజయ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయల్​100కు ఫోన్​ చేయడంతో పోలీసులు వచ్చి విచారణ జరిపారు. అవార్డులు, రివార్డుల కోసం ఏరియా దవాఖానా మిడ్​వైఫ్​ స్టాఫ్ ​క్రిటికల్​ డెలివరీలను కూడా సాధారణ డెలివరీలు చేయాలని చూస్తూ ప్రాణాలు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు.