లగేజీ కోసం వెబ్​సైట్​నే హ్యాక్​ చేసిండు

లగేజీ కోసం వెబ్​సైట్​నే హ్యాక్​ చేసిండు

బెంగళూరు: ఎయిర్​పోర్టులో తబాదలైన లగేజీ కోసం ఓ ప్రయాణికుడు ఏకంగా ఎయిర్​లైన్స్​ వెబ్​సైట్​నే హ్యాక్​ చేసిండు.. సైట్​లోకి వెళ్లి తనతోటి ప్రయాణికుడి ఫోన్​ నెంబర్​ వెతికి పట్టుకున్నడు. తనతో పాటు తెచ్చిన బ్యాగ్​ను తీసుకెళ్లి ఇచ్చి, తన బ్యాగును తీసుకొచ్చుకున్నడు. ఈ తతంగాన్నంతా ట్విట్టర్​లో పెట్టడంతో అది కాస్తా వైరల్​ అయింది. పోయిన ఆదివారం బెంగళూరు ఎయిర్​పోర్టులో జరిగిందీ సంఘటన.. బెంగళూరుకు చెందిన నందన్​ కుమార్​ ఓ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్.. పనిమీద పాట్నా వెళ్లిన నందన్​ ఇండిగో ఫ్లైట్​లో ఆదివారం తిరిగొచ్చిండు. అయితే, ఎయిర్​పోర్టులో లగేజీ కలెక్ట్​ చేసుకునే టైమ్​లో పొరపాటున వేరే ప్రయాణికుడి బ్యాగ్​ను నందన్​ తీసుకెళ్లిండు. చిన్న తేడాలు మినహాయిస్తే ఆ బ్యాగ్​ కూడా తన బ్యాగ్​లానే ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు. బ్యాగ్​ తబాదలైన సంగతి ఇంటికెళ్లాక గానీ గుర్తించలేదు. ఆ తర్వాత ఇండిగో ఎయిర్​లైన్స్​ కస్టమర్​ కేర్​కు ఫోన్​ చేసి జరిగిన పొరపాటు గురించి చెప్పిండు. బ్యాగ్​ కోసం రోజంతా వేచి చూసినా ఉపయోగంలేకుండా పోయిందన్నడు. ఆ ప్రయాణికుడి ఫోన్​ నెంబర్​ చెప్పాలని కోరితే ప్రైవసీ పేరుతో కుదరదని చెప్పిన్రట. దీంతో బ్యాగు మీద రాసిన పీఎన్​ఆర్​ నెంబర్​తో వివరాలు తెలుసుకుందామని చేసిన ప్రయత్నం కూడా వృధా అయ్యిందని చెప్పాడు. దీంతో తన సాఫ్ట్​వేర్​ తెలివితేటలు ఉపయోగించి ఇండిగో వెబ్​సైట్​ను హ్యాక్ చేసి సదరు ప్రయాణికుడి ఫోన్​ నంబర్​ తెలుసుకున్నానని చెప్పిండు. ఆపై ఫోన్​ చేసి బయట కలుసుకున్నానని, ఆయన బ్యాగును ఇచ్చేసి తన బ్యాగును తెచ్చుకున్నానని నందన్​ చెప్పాడు. మీ వెబ్​సైట్​లో ఫలానా లొసుగు ఉందని ఇండిగో ఎయిర్​లైన్స్​ వాళ్లను హెచ్చరించానని అన్నడు. అయితే, తమ వెబ్​సైట్​ను హ్యాక్​ చేయడం సాధ్యం కాదని ఇండిగో ఎయిర్​లైన్స్​ పేర్కొంది.