కేసు పెడతారేమోనని భయపడి సమీపంలోని 4 అంతస్తుల భవనం ఎక్కి దూకేస్తానని హల్చల్
కోరుట్ల: మాస్క్ ఎందుకు ధరంచలేదని కండక్టర్ అడిగినందుకు.. జగిత్యాల జిల్లాలో కండక్టర్ కూ, ఓ ప్రయాణీకుడికి మధ్య గొడవ చోటుచేసుకుంది. కోపోద్రికుడైన యువకుడు బస్సు అద్దం పగులగొట్టి ఆ వెంటనే సమీపంలోని 4 అంతస్తుల భవనంపై ఎక్కి దూకేస్తానంటూ హల్చల్ సృష్టించాడు. కోరుట్లలో జరిగిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా బోధన్ కి చెందిన రాజు అనే వ్యక్తి కోరుట్ల నుండి ఆర్మూర్ వెళుతున్న ఆర్మూర్ డిపో బస్సు ఎక్కగా.. టికెట్ తీసుకుంటుండగా మాస్క్ ఎందుకు ధరించలేదనడిగాడు కండక్టర్. రాజు కండక్టర్ తో గొడవపడి.. ఏకంగా దాడికి తెగబడ్డాడు. పైగా కండక్టర్ ను కొట్టి.. బస్సులో నుంచి దిగి.. బస్సు అద్దాలు కూడా పగులగొట్టాడు. అక్కడినుంచి పారిపోయి ఓ నాలుగంతస్థుల బిల్డింగ్ పైకెక్కి దూకి చస్తానంటూ బెదిరిస్తూ హల్చల్ చేశాడు. కరెంట్ వైర్లపై పడితే ప్రమాదమని ఆ ప్రాంతంలో విద్యుత్ ను కూడా నిలిపేశారు అధికారులు. యువకుడిని బుజ్జగించి పోలీసులు... ఎలాగోలా కిందకు దించారు. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
