
రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావట్లేదు. హెల్మెట్ పెట్టుకోకుండా ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వారు కొందరుంటే.. సామర్థ్యానికి మించి బైక్పై ఎక్కి విచ్చలవిడిగా తిరిగే వారు మరికొందరు. వారికి ఎంత చెప్పినా వృథానే. ముంబయిలో సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి స్కూల్ పిల్లలను ఎక్కించుకుని స్కూటీపై వెళ్తున్నాడు. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా.. అతను ఒకరినో.. ఇద్దరినో.. ఎక్కించుకు వెళ్తే తప్పులేదు.
7 మంది చిన్నారుల్ని స్కూటీపై ప్రమాదకరంగా ఎక్కించుకుని ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రమాదకరంగా ప్రయాణం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. స్కూటీ నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు రహదారి భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు.