వర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి: పీహెచ్‭డీ విద్యార్థులు

వర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి: పీహెచ్‭డీ విద్యార్థులు

రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని.. పీహెచ్‭డీ విద్యార్థులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్‭ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో మొత్తం 1,062 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల రిక్రూట్మెంట్ ఆగిపోయిందని విద్యార్థులు చెప్పారు. పెండింగ్‭లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పలు పోస్టులను భర్తీ చేయాలని వినోద్ కుమార్‭కు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల వినతిపత్రం స్వీకరించిన వినోద్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ తమిళి సై త్వరలోనే ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. కోర్టు సమస్యలు, ఇతర సమస్యలను అధిగమించి బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సహా.. ఇతర ప్రాంతాల్లోని కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనుభవాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించిందని వినోద్ కుమార్ గుర్తు చేశారు.