ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో గులాబీ జెండా ఎగరాలని, అందుకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇప్పటి నుంచే కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట లోని క్యాంప్ ఆఫీస్ లో ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొన్ని ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో ఎంత కోల్పోయామో ప్రజలకు, నాయకులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. బీజేపీ నాయకులకు పచ్చ కామెర్లు వచ్చాయని, వరంగల్ లో ఆస్పత్రి పనులు నడుస్తున్నా, కాళేశ్వరం జలాలు కూడవెళ్లి వాగు గుండా ప్రవహిస్తున్నా వారికి కనిపించడం లేదన్నారు. అమిత్ షా కూడా దిగజారి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 

మార్చిలోపు సిద్దిపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి.. 

మార్చి లోపు సిద్దిపేట రైల్వే స్టేషన్ ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం  నర్సాపూర్ -కేసీఆర్ నగర్ శివారులోని రైల్వే స్టేషను నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. డిసెంబరు నెలలోపు దుద్దేడ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైను పూర్తయ్యేలా పనులు స్పీడ్​గా జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్​ నుంచి సిద్దిపేట వరకు 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రైల్వే శాఖకు భూమి అప్పగించిందని వెల్లడించారు. రైల్వే అధికారులు, ఎమ్మార్వో లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం పాల్గొన్నారు.

చెరుకు రైతులు నష్టపోకుండా చూడాలి 

సంగారెడ్డి టౌన్, వెలుగు : వేలాది ఎకరాల్లో సాగు చేసిన చెరుకు రైతులు నష్టపోకుండా రైతు శ్రేయస్సే ధ్యేయంగా అధికారులు, పరిశ్రమల యాజమాన్యం పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. సోమవారం  కలెక్టరేట్ సమావేశ హాల్​లో గణపతి షుగర్ క్రషింగ్ ప్రారంభించడానికి, లాకౌట్ ద్వారా నెలకొన్న సమస్యను తొలగించేందుకు ఎస్పీ రమణకుమార్, అసిస్టెంట్ కేన్ కమిషనర్ రాజశేఖర్, రమణి, డీసీఎల్ ​రవీంద్రరెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు, కార్మిక సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ జీతభత్యాలు పెంపు పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించాలన్నారు. క్రషింగ్ ప్రారంభంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. ఈ విషయమై రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను ఆయన ఆదేశించారు. సమావేశంలో రైతు ప్రతినిధులు అంజిరెడ్డి, నరసింహారెడ్డి, నాజర్, యూనియన్ ప్రతినిధులు శ్రీశైలం, రాజిరెడ్డి, గంగరాజు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వెలుగు, నెట్​వర్క్: హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు చేపట్టారు. ర్యాలీలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మెదక్​లో వీహెచ్​పీ మెదక్​ విభాగ్​ సంఘటన నాయకుడు పుట్టి మల్లేశం, వీహెచ్​పీ మెదక్  జిల్లా ప్రెసిడెంట్​ పబ్బ సత్యనారాయణ,  విభాగ్ ప్రచార ప్రముఖ్ అప్పాల సునీల్,  విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడు ఆరెళ్ల అరవింద్,  భజరంగ్​దళ్​ సహ సంయోజక్ మహేశ్,  బీజేపీ మెదక్​ జిల్లా ప్రెసిడెంట్ ​గడ్డం శ్రీనివాస్, కౌడిపల్లిలో  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, నారాయణఖేడ్​లో సంగారెడ్డి జిల్లా భజరంగ్​ దళ్​ కన్వీనర్ సంతోష్, పాపన్నపేటలో భజరంగ్​ దళ్​ మండల అధ్యక్షుడు బాలకృష్ణ, విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు బద్దాపురం సంగమేశ్​ మాట్లాడారు. హిందువులే శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని, ముస్లింలు అమాయకులన్న  సౌత్ జోన్ డీసీపీని వెంటనే సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు. గోషామహల్ ప్రాంతాన్ని తగలబెడతామన్న రషీద్ ఖాన్, ఫిరోజ్ ఖాన్​ను అరెస్టు చేయాలన్నారు. వినాయక నవరాత్రుల ముందు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడేందుకు మునావర్​ ఫారూఖీ షోకు అనుమతి ఇప్పించి, భద్రత కల్పించిన మంత్రి కేటీఆర్​పై చర్యలు తీసుకొని, మంత్రి వర్గం నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

త్వరలోనే టీచర్లకు ప్రమోషన్లు

సిద్దిపేట రూరల్, వెలుగు : త్వరలో అన్ని కేటగిరీల టీచర్లకు ప్రమోషన్లు వస్తాయని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి  తెలిపారు. సోమవారం ఆయన సిద్దిపేట అర్బన్ శాఖ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డితో కలిసి పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  సిద్దిపేట జీజీహెచ్ ఎస్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్ల సమస్యలు పీఆర్టీయూ ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయన్నారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హిందీ టీచర్ వెంకటేశం 15 మంది విద్యార్థినులకు సొంత ఖర్చులతో యోగా మ్యాట్​లను అందజేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ  జిల్లా అధ్యక్షుడు శశిధర్ శర్మ, గౌరవ అధ్యక్షుడు మల్లు గారి ఇంద్రసేనారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం వెంకటరాజం పాల్గొన్నారు.

డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల కోసం వినతుల వెల్లువ

మెదక్​టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు:  మెదక్​ కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన  ప్రజావాణిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎక్కువ సంఖ్యలో వినతులు వచ్చాయి. మొత్తం 66 వినతులు రాగా, వాటిలో 40 డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో వెయ్యి ఇళ్లు మంజూరైతే ఇప్పటికే 500 మంది లబ్దిదారులకు అందజేశామని, త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి మిగతా ఇళ్లు  మంజూరు చేస్తామని అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​ తెలిపారు. ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణిలో బాధితుల సమస్యలను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. సిద్దిపేటలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్జీలను స్వీకరించగా, వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 50 ఫిర్యాదులు అందాయి. వాటిని సంబంధిత ఆఫీసర్లకు అందజేస్తూ వెంటనే ఆ సమస్యల పరిష్కరించాలని ఆదేశించారు. 

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

సిద్దిపేట/నారాయణఖేడ్/కంది, వెలుగు : క్రీడాకారులకు పూర్తి సహకారం అందిస్తామని, మౌలిక వసతులు కల్పించి ప్రోత్సహిస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ధ్యాన్​చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కోమటి చెరువు -నెక్లెస్ రోడ్డులో 2కె రన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. త్వరలోనే సిద్దిపేటలో 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. అనంతరం మినిస్టర్​ క్యాంప్ ఆఫీస్ లో జాతీయ క్రీడాకారులను ఆయన సన్మానించారు.  ఆతర్వాత మోహిన్ పురాలో అమర్నాథ్ అన్నదాన సేవ సమితి,  రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మట్టి గణపతి  విగ్రహాలను పంపిణీ చేశారు. నారాయణఖేడ్ లో నిర్వహించిన 2కె రన్ లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని ధ్యాన్ చంద్ ఫొటోకు నివాళులర్పించారు. వివిధ క్రీడలలో గెలుపొందిన వారికి సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్  బహుమతులు అందజేశారు. 

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

మెదక్​ టౌన్, వెలుగు :  రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్ రమేశ్​ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఏఎస్పీ బాలస్వామితో కలిసి సమీక్షించారు. మనోహరాబాద్ నుంచి తూప్రాన్, చేగుంట, రామాయంపేట జాతీయ రహదారితో పాటు నర్సాపూర్–-మెదక్ రోడ్డు వెంట గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కొల్చారం మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని రోడ్ల వెంట, స్కూళ్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, డీఈవో రమేశ్​కుమార్, జిల్లా ఎక్సైజ్​ సూపరింటెండెంట్​రజాక్,   నేషనల్ హైవే ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.