కౌడిపల్లి, వెలుగు: రైతును రాజుగా తయారు చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, రైతుల వసతి గృహాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ మంగీలాల్ జాట్, అఖిల భారతీయ కార్యకారిణి సదస్య భాగయ్యతో కలిసి ప్రారంభించారు. జీవ నియంత్రణ ప్రయోగశాలను పరిశీలించారు. సేంద్రియ సాగు విధానం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు.
కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తోందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఏడాదికి లక్ష రూపాయలకు పావలా వడ్డీ కడితే సరిపోతుందని చెప్పారు. బడ్జెట్ లో వ్యవసాయం, అనుబంధరంగాలకు 5 శాతం అదనంగా కేటాయించిందని తెలిపారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు రూ.7 వేల కోట్లతో 10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్ పీవో) ఏర్పాటు చేసిందని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నట్లే మన వ్యవసాయాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని కృషి విజ్ఞాన కేంద్రం, ఏకలవ్య ఫౌండేషన్ ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. కేవీకేలో రైతులకు వసతి గృహం కట్టడం, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
రైతు కూలీల కొరత తీర్చడానికి డ్రోన్ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుందని తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రైతులు ఏ రకమైన పంటలు పండిస్తే భవిష్యత్తు బాగుంటుందో కేవీకే ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రకృతిని విధ్వంసం చేసి, జీవవైవిద్యాన్ని దెబ్బతీసి ఇంకేదో సాధిస్తామనుకుంటే పొరపాటేనని తెలిపారు. ఎలాంటి యుద్ధాలు వచ్చినా గ్యాస్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, బయో గ్యాస్ ఉత్పత్తి చేసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఏవో దేవ్ కుమార్, కేవీకే ఇన్చార్జి డాక్టర్ నల్కర్, సైంటిస్టులు రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, ఉదయ్, భార్గవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
