సంతలో పురిటి నొప్పులు.. రోడ్డు మీదనే డెలివరీ చేసిన డాక్టర్

సంతలో పురిటి నొప్పులు.. రోడ్డు మీదనే డెలివరీ చేసిన డాక్టర్
  • కీసరలో పాపకు జన్మనిచ్చిన మహిళ

హైదరాబాద్, వెలుగు: కూరగాయలు అమ్ముకునేందుకు సంతకు వచ్చిన ఓ మహిళకు అకస్మాత్తుగా పురిటినొప్పులు స్టార్ట్ అయినయి. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆమెకు అటుగా వెళ్తున్న ఓ డాక్టర్ అక్కడికక్కడే డెలివరీ చేశారు. రోడ్డు మీదనే పండంటి పాపకు జన్మనిచ్చిన ఘటన సోమవారం మేడ్చల్ జిల్లా కీసర సంతలో చోటుచేసుకుంది. కూషాయిగూడకు చెందిన రాజేశ్‌, శ్యామల దంపతులు ఎప్పటిలాగే సోమవారం సంతలో కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు శ్యామలకు పురిటి నొప్పులు వచ్చాయి. స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అదేటైంలో అటుగా వెళ్తున్న గాంధీ హాస్పిటల్ డాక్టర్ అర్జున్ విషయం తెలుసుకుని ఆమెను పరిశీలించారు. నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో అక్కడే ఆమెకు పురుడు పోశారు. ఆ తర్వాత అంబులెన్స్ లో తల్లిని, పాపను కీసర పీహెచ్ సీకి తరలించారు. తల్లి, పుట్టిన పాప ఇద్దరి హెల్త్ కండీషన్ బాగానే ఉందని డాక్టర్ అర్జున్‌ తెలిపారు. కాగా నార్మల్‌ డెలివరీలు చేయడంలో అర్జున్‌ బెస్ట్ డాక్టర్ గా పేరు పొందారు. 2012లో ఆయన బెస్ట్ మెడికల్ ఆఫీసర్ అవార్డు కూడా అందుకున్నారు. సమయానికి వచ్చి తన భార్య, బిడ్డను కాపాడిన డాక్టర్‌‌కు రాజేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.