జ్జానవాపి మసీదులో పూజలు షురూ

జ్జానవాపి మసీదులో పూజలు షురూ

యూపీలోని వారణాసిల జ్ఞానవాపి మసీదులో 31 ఏళ్ల తర్వాత ఇవాళ పూజలు మొదలయ్యాయి. వ్యాస్  కా తెహఖానా సెల్లార్ లో ఇవాళ ఉదయం 3గంటలకే తొలి పూజ ప్రారంభమైంది.  వారం రోజుల్లో పూజలు మొదలు పెడతామని  కాశీ విశ్వనాథుని ట్రస్ట్ చెప్పినప్పటికీ ఇవాళే పూజలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ హిందూ దళ్ కార్యకర్తలు అక్కడ ఉన్న బోర్డులో మసీదు అనే పదాన్ని తొలగించి టెంపుల్ అని పెట్టారు. 31 సంవత్సరాల తర్వాత, వ్యాసజీ నేలమాళిగలో హిందువులు పూజలు నిర్వహించారు.

వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఏరియాలోని సీల్డ్ బేస్​మెంట్​లో హిందూ పిటిషనర్లు పూజలు చేసుకోవచ్చని సిటీ కోర్టు  జనవరి 31న  తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బారికేడ్లను తొలగించి వారం రోజుల్లో బేస్​మెంట్​ను రెడీ చేయాలని పేర్కొంది. కాశీ విశ్వనాథ్  ఆలయానికి చెందిన పూజారులతో పూజలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ మసీదు బేస్​మెంట్​లో పూజలు చేసుకునేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని ఈ కేసులో నలుగురు హిందూ మహిళల తరపున వాదిస్తున్న అడ్వొకేట్  విష్ణుశంకర్  జైన్  అన్నారు. 

అయితే సిటీ కోర్టు తీర్పును జ్ఞానవాపి మసీదు కమిటీ హైకోర్టులో సవాలు చేయనుంది. ఈ మసీదులోని బేస్ మెంట్​లో నాలుగు సెల్లార్లు ఉన్నాయి. ఒక సెల్లార్  పూజారుల ఫ్యామిలీ ఆధీనంలో ఉంది. వంశపారంపర్య పూజారులుగా అక్కడ పూజలు చేసుకునేందుకు తమకు హక్కు ఉందని ఆ కుటుంబం మొదటి నుంచి వాదిస్తోంది. 1993 వరకు పూజారి సోమనాథ్  వ్యాస్  అక్కడ పూజలు చేసేవారని తెలిపింది. కాగా, జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్​లోని వజుఖానా ప్రాంతంలో శివలింగం బయటపడిందని, ఆ విషయంపై సైంటిఫిక్  సర్వే నిర్వహించాలని కోరుతూ హిందూ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.