పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్‌

పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్‌

పట్నా: ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రొఫెసర్ తన నిజాయితీని చాటుకున్నాడు. కరోనా సమయంలో పాఠాలు బోధించలేదని తనకు వచ్చిన వేతనాన్ని తిరిగి ఇచ్చేశాడు. 33 నెలల జీతం 24 లక్షలను తాను చదువు చెబుతున్న కాలేజీకే అందించి తన గొప్పతనం చాటుకున్నాడు. 
 
బీహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్‌ కుమార్ అనే ప్రొఫెసర్ (హిందీ టీచర్‌) ఢిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్, ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, ఎంఫిల్‌ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజఫర్‌పూర్‌లోని నితిశేశ్వర్‌ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. ఇది బీఆర్‌ అంబేడ్కర్‌ బీహార్‌ యూనివర్శిటీ (బీఆర్‌ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబరులో లలన్‌ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకే కరోనా విజృంభించింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులు జరిగినప్పటికీ కొంతమంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. దీంతో సరిగ్గా పాఠాలు బోధించలేదు. దీంతో లలన్‌ కుమార్ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు తిరిగిచ్చేశారు.

కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయానని, పాఠాలు చెప్పనప్పుడు జీతం తీసుకొనేందుకు తన అంతరాత్మ అంగీకరించలేదని, అందుకే వేతనాన్ని తిరిగిచ్చేశానని ప్రొఫెసర్ లలన్‌ కుమార్ చెప్పారు. 33 నెలలకు రూ.23,82,228 వేతనాన్ని తీసుకోగా.. ఆ మొత్తాన్ని లలన్‌ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. అతడి గొప్పతనాన్ని బీఆర్‌ఏబీయూ రిజిస్ట్రార్‌ అభినందించారు.

అయితే.. నితిశేశ్వర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ మనోజ్ కుమార్ వెర్షన్ మరోలా ఉంది. లలన్‌ ఇటీవల పీజీ డిపార్ట్‌మెంట్‌లో బదిలీకి అభ్యర్థన పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన తన వేతనాన్ని తిరిగి ఇచ్చేశాడని ప్రిన్సిపల్‌ మనోజ్ కుమార్ ఆరోపించారు. అయితే, లలన్‌ క్లాసులకు పిల్లలు హాజరుకాకపోవడంతో బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించినట్లు సమాచారం. దీనిపై విచారణ జరుపుతామని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ బీహార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్కే ఠాకూర్ తెలిపారు.