
- భారత్ లోనే పీఎం2.5 అత్యంత కాలుష్యం
- అమెరికా సంస్థ అధ్యయనం వెల్లడి
కాలుష్య కారక అతి సూక్ష్మకణాలు (పీఎం2.5) అత్యంత తీవ్రస్థాయికి పెరిగిన 20 నగరాల్లో 18 భారత్‌లోనే ఉన్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడి కావడం ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం, ఆరోగ్యంపై పడుతున్న ప్రభావంపై 7 వేలకు పైగా నగరాల్లో అమెరికాకు చెందిన ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఈఐ)’ అనే పరిశోధన సంస్థ అధ్యయనం చేసింది. 2010 నుంచి 2019 వరకూ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఒక నివేదికను రూపొందించింది. అతిసూక్ష్మ కణ కాలుష్య కారకాల సగటు స్థాయి ఢిల్లీలో అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలైన పీఏం2.5, నైట్రోజన్ డైఆక్సైడ్ (ఎన్‌ఓ2)లపై పరిశోధకులు ప్రధానంగా దృష్టి సారించారు. పీఎం2.5 కారణంగా 7,239 నగరాల్లో 1.7 కోట్ల మంది మరణించినట్లు గుర్తించారు. ఆసియా, ఆఫ్రికా, తూర్పు, మధ్య ఐరోపా దేశాల్లో అత్యధిక ఆరోగ్య దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించారు.
హెచ్‌ఈఐ పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి..
* ప్రపంచవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో అత్యంత కాలుష్య నగరాలు 103 ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో అధిక జనాభా ఉన్న నగరాలకు గాను.. పీఎం2.5 కాలుష్య కారక వ్యాధుల తీవ్రత ఉన్న మొదటి పదింటిలో (2019లో) ఢిల్లీ, కోల్‌కతా ఉన్నాయి.
* భారత్, నైజీరియా, పెరూ, బంగ్లాదేశ్‌లలోని వివిధ నగరాల్లో ప్రజలు ప్రపంచ సగటు కంటే ఎన్నో రెట్లు పీఏం2.5తో ఇబ్బందులు పడుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది.
* భారత్, ఇండొనేసియాల్లో ‘పీఎం 2.5’ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుండగా, కాలుష్యాన్ని నియంత్రించడంలో చైనా ముందడుగు వేసింది.