శాటిలైట్ టౌన్​షిప్ లపై నజర్

శాటిలైట్ టౌన్​షిప్ లపై నజర్
  •      ఔటర్ అవతల భారీగా రానున్న నిర్మాణాలు 
  •      ఇప్పటికే గ్రీన్​ సిగ్నల్ ఇచ్చిన హెచ్ఎండీఏ ​
  •      పర్మిషన్లకు దరఖాస్తుల పరిశీలనలో అధికారులు
  •      నిర్మాణాలపై విధి విధానాలతో తయారైన పాలసీ 

హైదరాబాద్​, వెలుగు : ఔటర్​ రింగ్​రోడ్​కు అవతల త్వరలోనే భారీగా శాటిలైట్ టౌన్​షిప్ లు రానున్నాయి. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు హెచ్​ఎండీఏ కసరత్తు చేస్తోంది. గ్రేటర్ సిటీలో పెరిగిన ట్రాఫిక్​ ఒత్తిడిని తగ్గించేందుకు శివారులో టౌన్​షిప్​ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. కొంతకాలం కిందటే నోటిఫికేషన్ జారీ అయింది. నిర్మాణాలపై రూల్స్, మౌలిక వసతుల కల్పనపై పాలసీని కూడా తయారు చేశారు. టౌన్​షిప్​ల నిర్మాణానికి ఆసక్తి చూపించే సంస్థలను ప్రోత్సహించడంతో పాటు

హెచ్​ఎండీఏ నేరుగా ప్రభుత్వం భూముల్లో ప్రైవేట్​ సంస్థల భాగస్వామ్యంతో కూడా టౌన్​షిప్​లు నిర్మించనుంది. అందుకు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని అధికారులు ఆరా తీస్తున్నారు. శాటిలైట్​ టౌన్​షిప్​లు పెరిగితే  సిటీ మరింతగా విస్తరించనుంది. ఓఆర్ఆర్​కు దూరంగా వీటిని నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ప్రభుత్వం భావించింది.  సిటీలో పెరిగిపోతున్న ట్రాఫిక్​ ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని కూడా పేర్కొంటుంది.  

వంద ఎకరాలు ఉంటేనే అనుమతి

ఔటర్​ శివార్లలో టౌన్​షిప్​లను నిర్మించే వారు కనీసం 100 ఎకరాల భూమి కలిగి ఉండాలి. ఔటర్​కు కనీసం 5కి.మీ. దూరంలో నిర్మించాలనే రూల్​కూడా పెట్టారు.  గతంలో నోటిఫికేషన్​ జారీ చేసినప్పుడు రెండు సంస్థలు టౌన్​షిప్​ల నిర్మాణానికి ముందుకొచ్చాయి.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం దామర్లపల్లిలో 500 ఎకరాల్లో టౌన్​షిప్ నిర్మాణానికి ఒక సంస్థ, ఇంకో చోట100 ఎకరాల్లో నిర్మాణానికి మరో సంస్థ దరఖాస్తులు చేశాయి.  ఇంకొన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్టు అధికారులు తెలిపారు. టౌన్​షిప్​లలో వంద అడుగుల అప్రోచ్​రోడ్​ మస్ట్ గా ఉండాలని, మిగిలిన మౌలిక వసతులను కల్పించాలని రూల్​పెట్టింది.

టౌన్​షిప్​ల నిర్మాణానికి ఛేంజ్​ ఆఫ్​ల్యాండ్​ (భూ మార్పిడి) అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. టౌన్​షిప్​లలో తప్పనిసరిగా ఆటస్థలాలు, రోడ్లు, హాస్పిటల్స్​, షాపింగ్​ మాల్స్​, కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఓఆర్​ఆర్​ చుట్టూ టౌన్​షిప్​ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. అలాగే వాటి నిర్మాణాలకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గ్రేటర్​ పరిధిలో రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్​ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. శాటిలైట్​ టౌన్​షిప్​ల నిర్మాణంతో సిటీపై ఒత్తిడి తగ్గుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు.