
- మాది త్యాగాల కుటుంబం..తెలంగాణతో మాకున్నది రక్త సంబంధం
- కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తం
- ఆ సొమ్మును ప్రజలకు పంచిపెడ్తం
- మోదీ, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం
- లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసే ఉంటాయని కామెంట్
- దేశంలో ఎక్కడా లేని అవినీతి తెలంగాణలోనే ఉన్నది: ప్రియాంకా గాంధీ
- రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని ఫైర్
- మల్కాజ్‌గిరిలో భారీ రోడ్ షో..రాహుల్, ప్రియాంక డ్యాన్స్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రావడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశమిస్తే, వచ్చే ఐదేండ్ల పాటు ప్రజా పరిపాలన అంటే ఎట్లుంటదో చూపిస్తామని చెప్పారు. ‘‘ప్రజలు కోరుకున్నది దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ. తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగం చేస్తే, కేవలం ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడింది. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి” అని పిలుపు నిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోని మల్కాజ్‌గిరిలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుంటున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లక్షల కోట్ల అవినీతి సొమ్మును కక్కిస్తాం.
ఆ డబ్బునంతా ప్రజలకు పంచిపెడతాం” అని చెప్పారు. ‘‘గాంధీ కుటుంబం రాజకీయ కుటుంబం కాదు.. త్యాగాల కుటుంబం. తెలంగాణతో మాకున్నది రాజకీయ సంబంధం కాదు.. రక్త సంబంధం. ఇక్కడి ప్రజలు గతంలో ఇందిరాగాంధీని ఆదరించారు. తర్వాత సోనియాగాంధీని ప్రేమించారు. అందుకే ఆమె తెలంగాణ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది” అని తెలిపారు.
మోదీది శత్రుత్వం.. నాది ప్రేమ
తమ పార్టీకి దేశ ప్రయోజనాలే ముఖ్యమని రాహుల్ చెప్పారు. దేశవ్యాప్తంగా భారత్‌జోడో యాత్ర నిర్వహించి, ప్రజలను ఏకం చేసేందుకు కృషి చేశానన్నారు.
‘‘ప్రధాని మోదీ శత్రుత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ నేను ప్రేమతోనే ప్రజల హృదయాల్లోకి వెళ్లాను. శత్రుత్వంతో ఏదీ సాధించలేం. ప్రేమతోనే ఏదైనా సాధించవచ్చు. మోదీ నాపై క్షక్షసాధింపులకు పాల్పడుతున్నారు. నాపై ఇప్పటి వరకు 26 కేసులు పెట్టారు. నన్ను పార్లమెంట్‌కు రాకుండా చేసి, చివరకు నా ఇంటిని కూడా గుంజుకున్నారు” అని మండిపడ్డారు.
‘‘మోదీ, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. మజ్లిస్ కూడా బీజేపీకిమిత్రపక్షమే. అందుకే పలు రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి ఆ పార్టీ సహకరించింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు ఒక్కటే. ప్రజల్ని మాత్రం మభ్యపెడుతున్నారు” అని ఫైర్ అయ్యారు.
కేసీఆర్‌కు బైబై చెప్పండి : ప్రియాంక
కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే, ఒక కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని అవినీతి తెలంగాణలోనే ఉందన్నారు. ప్రజలు కోరుకున్నది ప్రజా తెలంగాణ అని.. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం కలిసి దొరల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ‘‘అవినీతిపరుల చేతిలో రాష్ట్రాన్ని పెడ్దామా? లేదంటే నిజాయతీతో పాలించేటోళ్లను ఎన్నుకుందామా? కుటుంబ పాలన కావాలా? లేదంటే ప్రజా పాలన కావాలా?” అని ప్రశ్నించారు.
నీతివంతమైన ప్రభుత్వం కావాలంటే ఈసారి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘‘మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మంచి భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేయండి. కేసీఆర్ కు బై..బై.. చెప్పండి” అని అన్నారు. రోడ్ షోలోరేవంత్ రెడ్డి, రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో ఫుల్ జోష్..
రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. మల్కాజిగిరి పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. మల్కాజగిరి చౌరస్తా నుంచి ఆనంద్బాగ్చౌరస్తా వరకు దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో ఆనంద్బాగ్చౌరస్తాకు చేరుకున్న రాహుల్, ప్రియాంక.. అక్కడి నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా జనం ఘన స్వాగతం పలకగా.. రాహుల్, ప్రియాంక అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. ప్రచార వాహనంపై రాహుల్, ప్రియాంక, రేవంత్, కాంగ్రెస్ మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు తదితరులు డ్యాన్స్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
నిరుద్యోగుల గొంతు కోసిండు..
పేపర్ల లీకులతో సీఎం కేసీఆర్ నిరుద్యోగుల గొంతు కోశారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. యువకుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో యువతకు ఉద్యోగాలు దక్కకపోవడం బాధాకరమన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ప్రియాంక పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్పాలనంతా అవినీతిమయమని, ప్రతి పనిలో కమీషన్లు, వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు.