ఎస్సై చేతిలో పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా

ఎస్సై చేతిలో పేలిన తుపాకీ..  మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా

ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి.  టైం బాగోలేకపోతే పరిస్థితి తారుమారవుతుంది. ఈ ఘటన కూడా ఇదే చెబుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. ఒక మహిళ పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ కోసం కొత్వాలినగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. లోపలికి వెళ్లి అక్కడే కాసేపు నిల్చున్నారు. ఆ కాసేపటికే ఒక పోలీస్‌ అధికారి వచ్చి ఎస్సైకి తుపాకీ ఇవ్వడం..  ఆ పిస్టల్‌ను ఆయన శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ అది పేలింది. పిస్టల్ నుంచి తూటా ఎదురుగా ఉన్న మహిళ తలలోకి దూసుకెళ్లింది.

వెంటనే బాధిత మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కొత్వాలి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ మనోజ్‌ శర్మపై కేసు నమోదు చేశాడు. అతడిని తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

మనోజ్‌ శర్మపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మహిళకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.