- .2021-22 నాటికి 7.40 లక్షల వర్క్స్
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.04 లక్షలకు డౌన్
- కొత్త హాజరు విధానం ఎఫెక్ట్..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ(జీ రామ్ జీ) పథకంలో ఏటేటా పనులు తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు లక్షల్లో పనులు జరగగా.. క్రమంగా పడిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పనుల గుర్తింపు నుంచి బిల్లుల చెల్లింపు వరకు నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కూలీల ఉపాధిపై ప్రభావం చూపుతున్నాయి.
కేంద్ర గణాంకాలను పరిశీలిస్తే.. ఉపాధి పనుల గ్రాఫ్ ఏటేటా పడిపోతున్నట్లు స్పష్టమవుతోంది. కఠిన నిబంధనలు, సాంకేతిక సమస్యలు, బకాయిల పేరుతో పనులను తగ్గిస్తుండటంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉపాధి స్కీమ్ కింద వ్యవసాయ అనుబంధ పనులు, చెరువుల పూడికతీత, రోడ్ల నిర్మాణం వంటి పనులు జోరుగా సాగేవి.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2021–22 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 7.40 లక్షల పనులు పూర్తయ్యాయి. 2024–25లో ఈ సంఖ్య అనూహ్యంగా 1.91 లక్షలకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు కేవలం1.04 లక్షల పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంటే 2021తో పోలిస్తే పనుల సంఖ్య దాదాపు 75 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం.
ఎన్‌ఎంఎంఎస్ దెబ్బ..
కేంద్రం అమల్లోకి తెచ్చిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్‌ఎంఎంఎస్) పనులు తగ్గడానికి ప్రధాన కారణం. దీని ప్రకారం కూలీలు పని ప్రదేశంలో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఆన్‌లైన్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు, సర్వర్ డౌన్ కావడం, స్మార్ట్ ఫోన్ల నిర్వహణ కష్టంగా మారడంతో మేట్లు, కూలీలు పనులకు రావడానికే ఆసక్తి చూపడం లేదు.
ఒక పూట హాజరు పడకపోయినా ఆ రోజు కూలి మొత్తం కోల్పోవాల్సి వస్తుండటంతో చాలామంది ఉపాధి పనులకు దూరమవుతున్నారు. దీనికితోడు గతంలో ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని, నిధులు దారి మళ్లాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ ముమ్మరం చేస్తోంది. అక్రమార్కులపై వేటు వేయడం, రికవరీ చర్యలు చేపట్టడంతో క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారుల్లో ఆందోళన నెలకొంది.
కొత్తగా పనులను గుర్తిస్తే ఎక్కడ నిబంధనల ఉచ్చులో పడతామోనన్న ఆందోళనతో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీవోలు కొత్త పనుల ప్రతిపాదనలకే వెనుకంజ వేస్తున్నారు. దీంతో పనుల మంజూరుపై ప్రభావం చూపుతోంది. ఉపాధిహామీలో చేసిన పనులకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్(సిమెంట్, ఇతర సామగ్రి) బిల్లులు పెండింగ్‌లో ఉండటం.. దీనికి తోడు నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి.
మరోవైపు స్కీమ్‌లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఫేక్ జాబ్ కార్డులను ఏరివేసింది. ఆధార్ సీడింగ్, జాబ్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియలో వేల సంఖ్యలో నకిలీ కూలీల పేర్లను తొలగించారు. దీనివల్ల రికార్డుల్లో పనుల సంఖ్య, కూలీల సంఖ్య భారీగా తగ్గినట్లు కనిపిస్తోంది.
