- రోడ్డే బార్డర్ లైన్‌గా ములుగు జిల్లా మహ్మద్‌గౌస్‌పల్లి, హనుమకొండ జిల్లా కటాక్షపూర్
ములుగు, వెలుగు : సాధారణంగా ఒక ఊరికి ఒకే పేరు ఉంటుంది. ఆ ఊరు మొత్తం ఒకే మండలం, ఒకే జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ ఓ ఊరిలో మాత్రం పక్కపక్కన ఉన్న ఇండ్లు రెండు గ్రామాలు, రెండు మండలాలు, రెండు జిల్లాల పరిధిలోకి వస్తాయి. పేరుకు ఊరంతా ఒకటే అయినా.. గ్రామాల పేర్లు, పంచాయతీ ఆఫీస్‌లు, మండలాలు, జిల్లాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.
అవే ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లి, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ గ్రామాలు. ఇవి చూడడానికి ఒకే గ్రామంగా కనిపించినా రెవెన్యూ గ్రామాల బార్డర్ లైన్ ఈ ఊరి మధ్యలోంచి వెళ్తుండడంతో రెండు పంచాయతీలుగా ఏర్పాటైంది. గతంలో ఆత్మకూరు మండలంలోని హౌస్‌బుర్గులో 7 వార్డులు, ఆ గ్రామ పరిధిలోని కటాక్షపూర్‌లో 3 వార్డులు కలిపి మొత్తం 10 వార్డులతో గ్రామ పంచాయతీ ఉండేది.
కటాక్షపూర్ కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైన తర్వాత అక్కడ ఎనిమిది వార్డులను ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో 1150 జనాభా ఉండగా.. 800 మంది ఓటర్లు ఉన్నారు. పక్కనే ఉన్న ములుగు జిల్లా మహ్మద్‌గౌస్‌పల్లిలో 10 వార్డులు ఉండగా 1,255 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామాలు పక్కపక్కనే ఉండడంతో ఆయా గ్రామస్తులంతా కలిసే ఉంటారు.
రెవెన్యూ, పోలీసులకు సంబంధించిన పాలనాపరమైన కార్యకలాపాలు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు, పండుగలను కలిసే జరుపుకుంటారు. గ్రామంలో ఈ రెండు జీపీలను వేరు చేసే చోట శివాజీ విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం గ్రామపంచాయతీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక గ్రామానికి సంబంధించిన ఎలక్షన్లలో మరో జీపీ ప్రజల ప్రభావం ఉండనుంది.
మహ్మద్‌గౌస్‌పల్లిలో రెండో విడతలో డిసెంబర్14న, కటాక్షపూర్‌లో మూడో విడతలో డిసెంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ రెండు జీపీల పరిధిలో ఉన్న పలువురి భూములు వరంగల్ జిల్లా పరిధిలోని నందిగామ రేలకుంట రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండడం
మరో విశేషం.
