తక్కువ రేటుకు బంగారం అంటూ చీటింగ్

తక్కువ రేటుకు బంగారం అంటూ చీటింగ్
  •     13 మంది నుంచి రూ.6.12 కోట్లు వసూలు 
  •     సాఫ్ట్​వేర్ ​ఉద్యోగి అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు : తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ ఓ సాఫ్ట్​వేర్​ఉద్యోగి 13 మందిని మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10లక్షలు కట్టించుకుని పరారయ్యాడు. సైబరాబాద్ ఎకనామిక్​అఫెన్స్​వింగ్ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పుత్తూరుకు చెందిన గంట శ్రీధర్(40) మాదాపూర్​లోని ఓ సాఫ్ట్​వేర్​కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొండాపూర్​మజీద్​బండలో ఉంటున్నాడు. తోటి ఉద్యోగులతోపాటు బంధువులకు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు.

అలా 13 మంది శ్రీధర్​కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున చెల్లించారు. డబ్బు కట్టించుకున్నాక గోల్డ్​ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న శ్రీధర్​పై ఓ బాధితుడు సైబరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో శ్రీధర్ 13 మంది చీట్​చేసి రూ.6.12 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్ట్​చేశారు.