
భద్రాచలం, వెలుగు: ఓ కొడుకు తల్లిదండ్రులను కొట్టి ఇంట్లోంచి గెంటేసిన అమానవీయ ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. భద్రాచలం టౌన్ సుభాష్ నగర్‌కు చెందిన వనచర్ల వెంకటేశ్(పండు) ఆదివారం రాత్రి తల్లిదండ్రులైన రాంబాబు, మంగమ్మను చితకబాది రోడ్డుపైకి గెంటేశాడు. ఆ రాత్రి పక్కింట్లో నిద్రపోయారు. తన పేరెంట్స్ కు ఆశ్రయం ఇచ్చిన వారిని వెంకటేశ్బూతులు తిట్టాడు.
స్థానికుల సాయంతో భద్రాచలం టౌన్ పోలీసులకు బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. వెంకటేశ్ సోదరి కేతా భవాని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటూ తల్లిదండ్రుల బాగోగులను చూసుకుంటోంది. దీంతో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోవాలని పేరెంట్స్ పై వెంకటేశ్ఒత్తిడి చేస్తుండగా పట్టించుకోవడంలేదు. దీంతో ఇంట్లో నుంచి గెంటేశాడు. గతంలో కూడా తల్లిదండ్రులను చితకబాదినట్లుగా స్థానికులు చెప్పగా.. పోలీసులు విచారణ చేస్తున్నారు.