లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు

లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు
  • నిందితుల అభ్యర్థనతో ఇంటి భోజనం, వింటర్ క్లాత్స్​కు అనుమతి
  • విచారణ డిసెంబర్ 5కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌ కేసులో హైదరాబాద్‌‌కు చెందిన శరత్ చంద్రతో పాటు, బినోయ్ బాబుకు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీ ల్యాండరింగ్ కేసులో దర్యాప్తు పెండింగ్‌‌లో ఉన్నందున.. ఈడీ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ రావుస్ ఎవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌‌లో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కీలక వ్యక్తులని పేర్కొన్న ఈడీ.. ఈ నెల 14 న సీబీఐ స్పెషల్ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఆ మేరకు ఐదు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. తర్వాత మరో 5 రోజులు పొడిగించింది. 

సోమవారంతో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఈడీ అధికారులు శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబును కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల అరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పలు సౌకర్యాలు కల్పించాలని కోర్టును వారి న్యాయవాదులు కోరారు. స్పందించిన సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ నాగ్ పాల్.. ‘ఇలాంటి కేసుల్లో స్పెషల్ ట్రీట్‌మెంట్’ ఇవ్వలేమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శరత్ చంద్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. బినోయ్ బాబుకు డైజెషన్, ఇతర సమస్యలు ఉన్నాయని ఆయన తరపు అడ్వకేట్ కోర్టు దృష్టికి తెచ్చారు.

పలు సౌకర్యాలు కోరుతూ నిందితులు తమ అభ్యర్థన పత్రాలు అందించారు. దీంతో ఇంటి భోజనం, వాటర్ ఫ్లాస్క్, సొంతంగా రెండు జతల బట్టలు, వింటర్ క్లాత్స్, బూట్లు, అవసరమైన మందులు వాడేందుకు కోర్టు అనుమతించింది. జైలులో ఇద్దరు నిందితులకు వైద్య సాయం అందించాలని అధికారులకు జడ్జి ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ డిసెంబర్ 5 కు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. తర్వాత ఈడీ అధికారులు నిందితులను తీహార్ జైలుకు తరలించారు. కాగా, శరత్ చంద్రారెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన భార్య కనీకా రెడ్డి కోర్టు హాల్‌లో కన్నీరు పెట్టుకున్నారు. కాసేపు నిందితులు వారి కుటుంబ సభ్యులతో కోర్టు హాల్‌లో కూర్చోగా.. కనీకా రెడ్డి తన బాధను ఆపుకోలేక ఏడ్చారు.

శరత్ చంద్రా రెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భేటీ

శరత్ చంద్రా రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. విచారణ ముగిసిన తర్వాత కోర్టు హాల్‌లో కాసేపు ముచ్చటించారు. తర్వాత శరత్‌ను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించే సందర్భంలోనూ కోర్టు గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లి మాట్లాడారు.